ప్రపంచకప్‌ నిర్వహణకు మేం సిద్ధం!

ICC begins countdown to T20 World Cup 2021 - Sakshi

విజయవంతం చేస్తామన్న బీసీసీఐ  

దుబాయ్‌: ఎలాంటి అవాంతరం లేకుండా వచ్చే ఏడాది భారత్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్‌–2021ను షెడ్యూల్‌ ప్రకారమే  నిర్వహిస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని దేశాల్లాగే భారత్‌ కూడా కోవిడ్‌ కోరల్లో ఉన్నప్పటికీ టోర్నీ సమయానికల్లా పరిస్థితుల్లో మార్పు ఉండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ ఆతిథ్యమిచ్చే మెగా ఈవెంట్‌ వచ్చే అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో జరగనుంది.

ఏడాది కాలానికి కౌంట్‌డౌన్‌ను మొదలు పెడుతూ దుబాయ్‌లో ఐసీసీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో బోర్డు చీఫ్‌ దాదాతో పాటు కార్యదర్శి జై షా, ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ఐసీసీ ఈవెంట్‌ ఆతిథ్యం గొప్ప గౌరవమని అన్నారు. ‘నేను ఆటగాడిగా ఐసీసీ టోర్నమెంట్లను ఆస్వాదించాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షకులు ఎగబడి చూసే వినోదం, సందడి వాతావరణం నాకు తెలుసు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని అలాంటి సందడి తీసుకొస్తాం’ అని అన్నారు.  

ప్రేక్షకులు రావాలి
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్ని మాట్లాడుతూ మెగా ఈవెంట్‌ ప్రేక్షకుల సమక్షంలో జరగాలని ఆశించారు. ‘ఇటీవల కొన్ని క్రికెట్‌ బోర్డులు నిర్వహిస్తున్న టోర్నీలు, ఐపీఎల్‌ విజయవంతమైన అనుభవాలతో మెగా ఈవెంట్‌ కూడా జరుగుతుంది. 2016 తర్వాత భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ కావడంతో ఈ ఈవెంట్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది. అలాగే టోర్నీ సజావుగా జరిగేందుకు మేం కూడా భారత బోర్డుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, సమాలోచనలు చేస్తూనే  ఉన్నాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టోర్నీని ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని సాహ్ని అన్నారు. 

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి మెగా ఈవెంట్‌ కరోనా వల్లే వాయిదా పడింది. దీంతో 2021 ఆసీస్‌లో, తదుపరి ఏడాది భారత్‌లో నిర్వహించే పరస్పర మార్పు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ... పట్టుదలతో 2021 ఈవెంట్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు కార్యచరణతో ఉంది. ముందుగా భారత్‌లో జరగబోయే ముఖాముఖీ సిరీస్‌లపై దృష్టి సారించి అనంతరం బహుళ జట్లు పాల్గొనే ఈవెంట్లకు బాట వేయాలని బీసీసీఐ యోచిస్తోంది. మరో వైపు వరల్డ్‌ కప్‌ సమయానికి కూడా పరిస్థితులు మెరుగుపడకుండా కరోనా ప్రభావం కొనసాగితే టోర్నీ కోసం యూఏఈ, శ్రీలంకలను ప్రత్యామ్నాయం వేదికలుగా ఐసీసీ ఎంపిక చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top