Nominees for ICC Men's Test Player of the Year Revealed, Ashwin Name Included - Sakshi
Sakshi News home page

Test Player Of The Year: 'టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్‌' ఎవరు? రేసులో టీమిండియా స్పిన్నర్‌

Published Tue, Dec 28 2021 5:50 PM

ICC Announce 4 Nominees Test Player Of Year Award Only 1 Indian Spinner - Sakshi

టెస్టు క్రికెట్‌లో ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడికి టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఇవ్వడం ఆనవాయితీ. ఇక 2021 సంవత్సరానికి పోటీ పడుతున్న నలుగురు ఆటగాళ్ల నామినేషన్‌ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జేమిసన్‌, శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే ఉన్నారు.  

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఈ ఏడాది క్యాలెండర్‌ ఇయర్‌లో 15 టెస్టులాడి 1708 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్‌ చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌, వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ తర్వాత రూట్‌ ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో అత్యధిక​ పరుగులు చేసి మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టుగా విఫలమైనప్పటికి రూట్‌ మాత్రం స్థిరంగా రాణించడం విశేషం.

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో ఈ ఏడాది అత్యద్బుత ఫామ్‌ను కనబరిచాడు. 8 టెస్టుల్లో 52 వికెట్లు తీసిన అశ్విన్‌ బ్యాటింగ్‌లోనూ 337 పరుగులు సాధించాడు. ఇందులో ఒక టెస్టు సెంచరీ ఉండడం విశేషం.

ఇక న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కైల్‌ జేమిసన్‌ అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మంచి పేరు సంపాదించాడు. ఈ 12 నెలల కాలంలో జేమిసన్‌ ఐదు టెస్టు మ్యాచ్‌లాడి 27 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్‌ జట్టు టెస్టులో తొలిసారి ప్రవేశపెట్టిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలవడంలో జేమీసన్‌ కీలకపాత్ర పోషించాడు. అంతేగాక టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ జేమీసన్‌ అద్భుతంగా రాణించాడు. 

శ్రీలంక కెప్టెన్‌ దిముత్ కరుణరత్నే ఈ ఏడాది టెస్టు ఓపెనర్‌గా అద్భుతంగా ఆడాడు. ఏడు మ్యాచ్‌ల్లో 902 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో వరుసగా శతకాలు బాది లంక బెస్ట్‌ ఓపెనర్‌గా అవార్డు నామినేషన్‌లో చోటు దక్కించుకున్నాడు.

Advertisement
Advertisement