ఆశల పల్లకిలో ఐపీఎల్‌కు.. సందీప్

Hyderabad Player Bavanaka Sandeep In Sunrisers Team IPL 2020 - Sakshi

సెప్టెంబర్‌ 19 నుంచి మ్యాచ్‌లు 

21న వెళ్లనున్న భావనక సందీప్‌ 

నగర క్రికెట్‌ అభిమానుల ఉత్సాహం  

రాంనగర్‌ కుర్రోడు రాణిస్తాడనే నమ్మకం 

సాక్షి, ముషీరాబాద్‌: లక్షలాది మంది హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానుల ఆకాంక్షలను మూటగట్టుకొని  ఐపీఎల్‌లోఆడేందుకు శుక్రవారం (ఈ నెల 21న)బయలుదేరి వెళ్తున్నాడు రాంనగర్‌ కుర్రోడు భావనక సందీప్‌. ఐపీఎల్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల జరిగిన వేలంపాటలో సందీప్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దక్కించుకుంది. హైదరాబాద్‌ నుంచి మొదట ముంబై వెళ్లి ఈ నెల 23న మిగతా సన్‌రైజర్స్‌ జట్టుసభ్యులతో కలిసి యూఏఈకి ప్రత్యేక చాపర్‌లో వెళ్లనున్నాడు. యూఏఈలో ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న అనంతరం జట్టు సభ్యులు నెట్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించనున్నారు. సన్‌రైజర్స్‌ జట్టులో హైదరాబాద్‌ నుంచిప్రాతినిధ్యం వహిస్తోంది భావనక సందీప్‌ ఒక్కడే కావడం గమనార్హం.

ఈ సందర్భంగా సందీప్‌ ఏం చెప్పారంటే.. ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో నేనొక్కడినే హైదరాబాద్‌కు చెందినవాడిని ఉండడంతో సహజంగానే తనపై హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలను, ఆకాంక్షలను నేనుతప్పకుండా హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానుల మద్దతుతో నెరవేర్చడానికి కృషి చేస్తా. ఇప్పటివరకు రంజీ, దేశవాలీ క్రికెట్‌ మాత్రమే ఆడాను. ప్రస్తుతం ప్రపంచ మేటి ఆటగాళ్లతో ఐపీఎల్‌లో ఆడబోతున్నాను. ఈ అవకాశం మూడేళ్లుగా  ఎదురుచూస్తున్నా. ముఖ్యంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏబీ డివిల్లియర్స్‌కు బౌలింగ్‌ చేయడం నా చిరకాల వాంఛ. భారత జట్టులో స్థానం సంపాదించేందుకు ఇక్కడే పునాదులు వేసుకుంటాను. అవకాశం కల్పించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి, వీవీఎస్‌ లక్ష్మణ్‌కు, అంబటి రాయుడుకి, కోచ్‌లు జాన్, శ్రీధర్‌లకు, ఫిట్‌నెస్‌ సాధించేందుకు గంటల తరబడి నాకు బౌలింగ్‌ చేసిన మణితేజ, మధుసూదన్‌రెడ్డిలకు, చిన్నప్పటి నుంచే నాలోని క్రికెట్‌ను తట్టిలేపిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను’.
 
సందీప్‌ రికార్డులివీ.. 
2010లో 18 ఏళ్ల వయసులో రంజీతో రంగప్రవేశం చేసిన సందీప్‌ మొదటి మ్యాచ్‌లోనే ఝార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్‌ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్‌మన్‌గా సందీప్‌ నిలిచాడు. ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఇతను లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ కూడా. విజయ్‌ హజారే 50 ఓవర్ల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ నుంచి 14 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌ ప్రతిభను చాటాడు. బీటెక్‌ పూర్తిచేసి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించిన సందీప్‌ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో తన నైపుణ్యాన్ని చాటుతూ తన చిరకాల స్వప్నమైన ఐపీఎల్‌లో స్థానం దక్కించుకున్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top