
Photo Courtesy: BCCI
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో (బెంగళూరు) ఐపీఎల్ రీస్టార్ అవుతుంది. ఐపీఎల్ పునఃప్రారంభం నేపథ్యంలో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఏయే జట్లకు దక్కే అవకాశం ఉందో అన్న దానిపై ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం గుజరాత్, ఆర్సీబీ తలో 16 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలు) ఖాతాలో కలిగి ఉండి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. ఇరు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. ఈ రెండు జట్లు మూడింటిలో తలో మ్యాచ్ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం ప్రధానంగా మూడు జట్ల మధ్య పోటీ ఉంటుంది. రేసులో పంజాబ్ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?
ఈ సీజన్‌లో ముంబై మరో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. వీరి టేబుల్ స్థానం మొదటి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్, ఆర్సీబీ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు జట్లు 22 పాయింట్లతో ముగించే అవకాశాలు ఉన్నాయి.
ముంబై తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిస్తే, వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టమవుతాయి. ఒకవేళ ముంబై ఢిల్లీని ఓడిస్తే.. ఆతర్వాత పంజాబ్ కూడా ఢిల్లీని ఓడించాలి. అప్పుడు ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది. ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
ఒకవేళ ముంబై పంజాబ్‌ను ఓడించి ఢిల్లీ చేతిలో ఓడితే.. ఆతర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ కూడా పంజాబ్‌ను ఓడిస్తే పంజాబ్ ఇంటికి (పంజాబ్ రాజస్థాన్ చేతిలో కూడా ఓడాలి) ఢిల్లీ (17), ముంబై (16) ప్లే ఆఫ్స్‌కు చేరతాయి.
ఒకవేళ ముంబై తమ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే వారి ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
కేకేఆర్, లక్నో కూడా రేసులోనే..!
కేకేఆర్ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో (కేకేఆర్ 2, లక్నో 3) గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.
ఈ మూడు టీమ్‌లు ఔట్
ఈ సీజన్‌లో సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.