Virat Kohli: బ్యాటింగ్‌ ఫామ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన హర్బజన్‌ సింగ్‌ 

Harbhajan Singh Fires Warning To Virat Kohli Over Batting Form - Sakshi

Harbhajan Singh Warns Virat Kohli Over Batting Form: గత రెండేళ్లుగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని భారత మాజీ స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ గట్టిగా హెచ్చరించాడు. ఇన్ని రోజులు కెప్టెన్‌ హోదాలో ఉన్నావు కాబట్టి నడిచిందని, ఇకపై రాణించకపోతే జట్టులో స్థానం కూడా గల్లంతవుతుందని అలర్ట్‌ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ నెలకొందని, ఇది దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్‌ చేయాలని సూచించాడు. 

త్వరలో ఐపీఎల్‌ 2022 ప్రారంభంకానుండగా, క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రాణించే దేశీయ ఆటగాళ్లు సైతం టీమిండియాలో స్థానం కోసం పోటీపడతారని, వీరి నుంచి కూడా కోహ్లి స్థానానికి ముప్పు పొంచి ఉందని వార్నింగ్‌ ఇచ్చాడు. ఎంతటి ఘన చరిత్ర కలిగిన ఆటగాడికైనా మంచి ప్రదర్శనలే జట్టులో స్థానం కల్పిస్తాయని, కోహ్లి అందుకు అతీతుడేమీ కాదని అభిప్రాయపడ్డాడు. గతంలో దిగ్గజ క్రికెటర్లు సైతం జట్టులో స్థానం కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించాడు. 

ఐదు నెలల క్రితం వరకు కోహ్లి అన్ని ఫార్మాట్లలో జట్టు కెప్టెన్‌గా ఉన్నాడని, జట్టు ఎంపికలో కెప్టెన్‌కే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఫామ్‌తో సంబంధం లేకుండా తుది జట్టులో ఉన్నాడని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని కోహ్లి గ్రహించాలని సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోహ్లిపై ఒత్తిడి సహజమేనని, అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. కాగా, విరాట్‌ కోహ్లి.. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో అతను ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. 

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్‌ సిరీస్‌ ఓటమి అనంతరం అతను టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 
చదవండి: IPL 2022: అందుకే స్టొయినిస్‌ను ఎంపిక చేశారు: గంభీర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top