KL RAHUL: 'రాహుల్ కూడా మనిషే.. కొంచెం ఆలోచించి మాట్లాడండి'

Harbhajan Singh comments on Venkatesh Aakash Twitter spat - Sakshi

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్‌కు కొంత మంది మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంత మంది తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్దం కూడా నడిచింది.

రాహుల్‌కి ఫేవరెటిజం వల్లే జట్టులో చోటు దక్కుతుందని వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు. అందుకు బదులుగా రాహుల్‌ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారంటూ వెంకటేశ్ ప్రసాద్‌కు ఆకాష్‌ చోప్రా చురకలు అంటించాడు.

ఇక తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాడు పేలవ ఫామ్‌లో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను వెల్లడించవచ్చు కానీ, అదే పనిగా విమర్శలు చేయడం సరికాదు అని హర్భజన్ అన్నాడు.

"ఏ ఆటగాడైనా బాగా రాణించకపోతే ముందుగా బాధపడేది ఆ ఆటగాడు, అతని కుటుంబ సభ్యులే. మనమందరం ఆ క్రికెటర్లను ఇష్టపడతాం. కాబట్టి వాళ్లు సరిగా ఆడకపోతే మనకు కోపం రావడం సహజం. కానీ ఒకే ఆటగాడిని టార్గెట్‌ చేసి మరి విమర్శలు చేయకూడదు. అలా చేయడంతో ఆ ప్లేయర్‌ మెంటాలిటీ దెబ్బ తింటుంది.

రాహుల్ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్లు? అతడు పరుగులు చేయడానికి ప్రయత్నించడం లేదని అనుకుంటున్నారా? అతడు టీమిండియాకు అద్భుతమైన ఆటగాడు. అదే విధంగా అతడు అద్భుతమైన కమ్‌బ్యాక్‌ కూడా ఇస్తాడు" అని యూట్యూబ్‌ ఛానల్‌లో హర్భజన్ పేర్కొన్నాడు.
చదవండి: ChatGPT: రాహుల్‌ను తప్పించాలా? అదీ మరీ..! నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top