Virat Kohli Birthday Special: Virat Kohli Top 5 Knocks And Best Innings - Sakshi
Sakshi News home page

Virat Kohli Best Innings: కోహ్లి కెరీర్‌లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..

Published Sat, Nov 5 2022 8:36 AM

Happy Birthday Kohli: Virat Kohli Top 5 Knocks Best Innings  - Sakshi

విరాట్‌ కోహ్లి ఇవాళ(నవంబర్‌ 5న) 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.అయితే ప్రతీ మనిషికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని తట్టుకొని నిలబడేవాడు జీవితంలో గొప్పవాడు అవుతాడు. కోహ్లికి అందుకు చక్కటి ఉదాహరణ.

కోహ్లి 33 నుంచి 34వ పడిలోకి అడుగుపెట్టే కాలంలో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇంతకముందు చాలా ఎదురుదెబ్బలు తగిలినప్పటికి అవన్నీ అతని బ్యాటింగ్‌ మూలంగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ గతేడాది మాత్రం కోహ్లి కెరీర్‌ను పాతాళంలో పడేసింది. ఒకవైపు కెప్టెన్సీ నుంచి తొలగింపు అనుకుంటే.. మరోవైపు పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక జట్టు నుంచి కోహ్లిని తీసేయాలన్న డిమాండ్‌ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే బౌన్స్‌ బ్యాక్‌ అయిన తీరు.. ఇవాళ టి20 ప్రపంచకప్‌లో కోహ్లి ఆడుతున్న తీరు చూడముచ్చటగా ఉంది.

అయితే కోహ్లి కెరీర్‌లో చాలా అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. వాటిలో ది బెస్ట్‌ ఏది అని చెప్పడం కష్టమే. కానీ మాకు తెలిసినంతవరకు ఇప్పుడు చెప్పబోయే ఒక ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రం కోహ్లి కెరీర్‌లో బెస్ట్‌ అని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకంటే అతను ఫామ్‌లో ఉన్నప్పుడు పరుగులు సాధిస్తే పెద్ద విషయం కాదు. జట్టు క‌ష్టాల్లో ఉన,‍్నప్పుడు లేదంటే తాను ఫామ్‌ కోల్పోయి తిరిగి బౌన్స్‌ బ్యాక్‌ అయిన ఇన్నింగ్స్‌లు అతని విలువను చూపిస్తాయని అంటారు. అందుకే కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఏంటంటే..

2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 49 పరుగులు 

► 2016 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కోహ్లిదే కీలకపాత్ర. 84 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా మహ్మద్‌ ఆమిర్‌ దెబ్బకు 8 పరుగులకే మూడు వికెట్లు తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కోహ్లి బ్యాటింగ్‌లో చూపిన తెగువ మరిచిపోలేనిది. కత్తుల్లా దూసుకొస్తున్న బంతులను ఓపికగా ఆడుతూ 51 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఆరోజు ఆడకపోయుంటే టీమిండియా 50 పరుగులకే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. కానీ కోహ్లి ఇచ్చిన ఉత్సాహంతో యువరాజ్‌(14 నాటౌట్‌), ఎంఎస్‌ ధోని(7 నాటౌట్‌) టీమిండియాను గెలిపించారు.

82 పరుగులు నాటౌట్‌ Vs పాకిస్తాన్‌, 2022 టి20 ప్రపంచకప్‌

► టి20 ప్రపంచకప్‌ 2022లో పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ విరాట్‌ కోహ్లి కెరీర్‌లోనే కాదు.. ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఇన్నింగ్స్‌తోనే కోహ్లిని GOATగా అభివర్ణించడం మొదలుపెట్టారు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో ఆఖర్లో కోహ్లి కొట్టిన రెండు సిక్సర్లు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో 90 వేల మంది సమక్షంలో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ ఇప్పటికీ కళ్లముందు ఉంది. టీమిండియాను గెలిపించిన తర్వాత కోహ్లి ఆకాశంలోకి చూస్తూ కన్నీటి పర్యంతం అవడం అతని మనసులో ఎన్నాళ్ల నుంచి ఎంత బాధ దాగుందనేది అర్థమయింది. 

122 పరుగులు నాటౌట్‌ Vs అఫ్గానిస్తాన్‌, ఆసియా కప్‌ 2022

► అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ వరకు కోహ్లిపై విమర్శలు దారుణంగా వచ్చాయి. కోహ్లి పని అయిపోయిందని.. తనను పక్కనబెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొనడం కోహ్లి అభిమానులతో పాటు సగటు వ్యక్తిని బాధపడేలా చేసింది. కానీ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ 71వ సెంచరీ సాధించాడు. ఎంత కాదన్నా కోహ్లి కెరీర్‌లో మాత్రం ఈ ఇన్నింగ్స్‌ ది బెస్ట్‌గా నిలిచిపోతుంది.

79 Vs పాకిస్తాన్‌, 2019 వన్డే వరల్డ్‌కప్‌

► 2019 వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా ఐదు హాప్‌ సెంచరీలతో దుమ్మురేపాడు. అందులో భాగంగానే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి రోహిత్‌ శర్మకు సపోర్ట్‌ ఇస్తూ ఆడిన 79 పరుగుల తుఫాను ఇన్నిం‍గ్స్‌ మరిచిపోలేము. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 140 పరుగులతో విధ్వంసం సృష్టించినప్పటికి కోహ్లి సుడిగాలి ఇన్నింగ్స్‌ ఫ్యాన్స్‌కు బాగా అలరించింది.

94 Vs వెస్టిండీస్‌, 2019

► 2019లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కోహ్లి 94 పరుగులు ఇన్నింగ్స్‌ కూడా బెస్ట్‌ అని చెప్పొచ్చు. 208 పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా తడబడిన సమయంలో కోహ్లి ఆదుకున్నాడు. విజయానికి 119 పరుగులు అవసరమైన దశలో 94 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు.

చదవండి: 'కింగ్‌' కోహ్లి.. కరగని శిఖరం

Advertisement
 
Advertisement
 
Advertisement