
న్యూఢిల్లీ: సీనియర్ బ్యాటర్ గాదె హనుమ విహారి దేశవాళీ క్రికెట్‌లో తన సొంత టీమ్ ఆంధ్రను వీడాడు. 2025–26 సీజన్ కోసం అతను ఈశాన్య జట్టు త్రిపురతో జత కట్టాడు. ఒక ఏడాది కోసం ప్రస్తుతానికి ఒప్పందం కుదుర్చుకున్నా, మున్ముందు దీనిని పొడిగించే అవకాశం ఉంది.
దేశవాళీలో మరో టీమ్ తరఫున ఆడేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) విహారికి నిరభ్యంతరకర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేసింది. తన కెరీర్‌ను పునర్‌నిర్మించుకోవడంలో భాగంగా మూడు ఫార్మాట్‌లలో ఆడేందుకే రంజీ ట్రోఫీలో ఎలైట్ డివిజన్‌లో ఉన్న త్రిపుర టీమ్‌ను విహారి ఎంచుకున్నాడు. ఈ విషయంలో ఏసీఏ అతనికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో జట్టును వదలాల్సి వచ్చిందని వెల్లడించాడు.
2024–25 సీజన్‌లో ఆంధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన విహారి... వన్డేల్లో విజయ్ హజారే ట్రోఫీ, టి20ల్లో ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
‘మూడు ఫార్మాట్‌లలో బాగా ఆడగల సత్తా నాకు ఉందని నమ్ముతాను. అందుకే ఇతర అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చాను. టి20 ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లను ఎంచుకుంటున్నామని ఏసీఏ నాకు చెప్పింది. దాంతో 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా ఆడటం అనవసరమని భావించా. అందుకే విజయ్ హజారేలో బరిలోకి దిగలేదు. పైగా కొత్త తరహా వాతావరణంలో ఆడాలని నాకూ ఉంది’ అని విహారి చెప్పాడు.
2023–24 సీజన్‌లో ఏసీఏతో విభేదాలు రావడంతో జట్టును వీడాలని అప్పుడే నిర్ణయించుకున్న విహారి గత సీజన్‌కు ముందే మధ్యప్రదేశ్ జట్టుతో చేరడం దాదాపుగా ఖాయమైంది. అయితే చివరి నిమిషంలో అతను మళ్లీ ఆంధ్రతో కొనసాగడానికి సిద్ధపడటంతో మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. త్రిపుర కూడా ఇంకా కెప్టెన్సీ విషయంలో విహారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు.
‘ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో ఏదైనా చిన్న జట్టు తరఫున ఆడటానికి ఇదే సరైన సమయం అనిపించింది. ముందుగా త్రిపుర సంఘం నన్ను అడిగింది. దాంతో ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమయ్యా. నేను కెపె్టన్‌ను అయినా కాకపోయినా సీనియర్‌గా జట్టుకు అన్ని విధాలా ఉపయోగపడతా. టీమ్‌లో చక్కటి ఆటగాళ్లు ఉన్నారు. పెద్ద టీమ్‌లపై రాణించే విధంగా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తా’ అని విహారి విశ్వాసం వ్యక్తం చేశాడు.