Graeme Smith: కీలక పదవి చేపట్టనున్న సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్‌

Graeme Smith Appointed Commissioner Of South Africa Upcoming T20 League - Sakshi

క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తర్వాత ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్‌, పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌), టి10 లీగ్‌, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక వీటి జాబితాలోకి సౌతాఫ్రికా కూడా చేరనుంది.  క్రికెట్‌ సౌతాఫ్రికా(సీఎస్‌ఏ) సౌతాఫ్రికా టి20 లీగ్‌ పేరిట కొత్త టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీ వెనుక పరోక్షంగా ఐపీఎల్‌ ప్రాంచైజీలు ఉండడం విశేషం. మొత్తం ఆరు టీమ్‌లు ఉండగా.. ఈ ఆరింటిని ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం. కేప్‌టౌన్‌, జోహెన్నెస్‌బర్గ్‌, డర్బన్‌, పోర్ట్‌ ఎలిజిబెత్‌, ప్రిటోరియా, పార్ల్‌ పేర్లతో ఉన్న ప్రాంచైజీలను ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే, లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేశాయి.

ఈ కొత్త టి20 లీగ్‌కు ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు గ్రేమీ స్మిత్‌ను కమిషనర్‌గా ఎంపిక చేసింది. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, కామెంటేటర్‌గా, అంబాసిడర్‌గా, కన్సల్టెంట్‌గా ఎన్నో ఘనతలు సాధించిన స్మిత్‌.. తాజాగా సీఎస్‌ఏలో డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌(డీఓసీ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సౌతాఫ్రికాలో క్రికెట్‌ను జాతీయంగా మరింత పటిష్టంగా తయారు చేయాలని.. కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించడానికే ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు సీఎస్‌ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా టి20 లీగ్‌ కమిషనర్‌గా ఎంపికైన స్మిత్‌ స్పందించాడు. 

''కొత్త తరహా టోర్నీకి కమిషనర్‌గా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా. సౌతాఫ్రికా క్రికెట్‌కు పనిచేయడానికి ఎంత సమయమైనా సంతోషంగా కేటాయిస్తా. ఇలాంటి పోటీతత్వం ఉన్న కొత్త టి20 లీగ్‌ను నడిపించేందుకు దైర్యం కావాలి. అది ఉందనే నమ్ముతున్నా. దేశవాలీ క్రికెట్‌లో మనకు తెలియని అద్బుత ఆటగాళ్లను వెలికి తీయాలనేదే సీఎస్‌ఏ ప్రధాన ఉద్దేశం. అందుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌ను ప్రారంభించనుంది. ఆరంభ దశలో సక్సెస్‌ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక సీఎస్‌ఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫోలెట్సీ మోసికీ కొత్త బాధ్యతలు తీసుకున్న గ్రేమీ స్మి్త్‌కు శుభాకాంక్షలు తెలపగా.. దక్షిణాఫ్రికాకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు స్మిత్‌ను అభినందనల్లో ముంచెత్తారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ టోర్నీ జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌ రెండు నెలల విండో క్రికెట్‌కు అనుమతించాలని బీసీసీఐ ఐసీసీని కోరగా.. అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఐపీఎల్‌కు ఆటంకం లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించాలని సీఎస్‌ఏ భావిస్తోంది.

ఇక గ్రేమి స్మిత్‌ దక్షిణాఫ్రికా తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అంతేగాక ఆల్‌టైమ్‌ టెస్టు కెప్టెన్లలో స్మిత్‌ పేరు కూడా ఉంటుంది. సౌతాఫ్రికాకు 54 టెస్టుల్లో విజయాలు అందించి.. అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా స్మిత్‌ రికార్డు సృష్టించాడు. 2003లో షాన్‌ పొలాక్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న స్మిత్‌.. 2014లో తాను రిటైర్‌ అయ్యే వరకు టెస్టు కెప్టెన్‌గా కొనసాగడం విశేషం. ఇక బ్యాటింగ్‌లోనూ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఓపెనర్స్‌ జాబితాలో స్మిత్‌ పేరు కచ్చితంగా ఉంటుంది. 2002-2014 వరకు సౌతాఫ్రికా తరపున స్మిత్‌ 117 టెస్టుల్లో 9265 పరుగులు, 197 వన్డేల్లో 6989 పరుగులు, 33 టి20ల్లో 982 పరుగులు సాధించాడు. స్మిత్‌ ఖాతా 27 టెస్టు సెంచరీలు, 10 వన్డే సెంచరీలు ఉన్నాయి.

చదవండి: యాసిర్‌ షా 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్‌ గుర్తురాక మానడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top