అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ | Going Through Some Failures Show Some Character: Sanju On RR Loss | Sakshi
Sakshi News home page

IPL 2024: అందుకే ఓడిపోయాం!.. వరుస వైఫల్యాలు.. ఇకనైనా: సంజూ

May 16 2024 8:47 AM | Updated on May 16 2024 9:17 AM

సంజూ శాంసన్‌ (PC: IPL/BCCI)

సంజూ శాంసన్‌ (PC: IPL/BCCI)

ఐపీఎల్‌-2024లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరినా వరుస పరాజయాలతో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది రాజస్తాన్ రాయల్స్‌. ఆరంభం నుంచి అదరగొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీ పడిన సంజూ శాంసన్ సేన.. తాజా ఓటమితో‌ రెండోస్థానం కూడా నిలబెట్టుకోలేని స్థితికి చేరింది.

పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా నామమాత్రపు స్కోరుకు పరిమితమై చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఓటమిపై స్పందించాడు.

అందుకే ఓడిపోయాం
‘‘మేము ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. 10- 15 పరుగులు వెనుకబడి ఉన్నాం. మేము గనుక మెరుగ్గా బ్యాటింగ్‌ చేసి ఉంటే ఈ వికెట్‌ మీద 160 కంటే ఎక్కువ పరుగులే రాబట్టగలిగేవాళ్లం.

తక్కువ స్కోరుకు పరిమితమైపోయినపుడే మ్యాచ్‌ దాదాపుగా మా చేజారిపోయింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని కట్టడి చేయడం కోసం నేను ఏకంగా ఐదుగురు నాణ్యమైన బౌలర్లను బరిలోకి దింపాను.

వైఫల్యాలు అంగీకరించకతప్పదు
కానీ ఫలితం లేకుండాపోయింది. గత నాలుగు మ్యాచ్‌లలో మేము ఓడిపోయాం. మా వైఫల్యాలను అంగీకరించకతప్పదు. జట్టులోని లోపాల గురించి చర్చించుకోవాల్సి ఉంది. మేము చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకోవాలి.

ఇక ముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలగా పోరాడాలి. ఈరోజు మేము మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే ఫలితం వేరేలా ఉండేది’’ అని సంజూ శాంసన్‌ విచారం వ్యక్తం చేశాడు.

ఇకనైనా
రానున్న మ్యాచ్‌లలోనైనా ఇలాంటి తప్పిదాలు పునరావృతం చేయకుండా ఉండాలంటూ జట్టును ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ ఎనిమిదింట గెలిచి 16 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.

అయితే, గత నాలుగు మ్యాచ్‌లలో మాత్రం వరుసగా ఓడిపోతోంది. మరోవైపు పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమకు మిగిలిన ఒక మ్యాచ్‌ గెలిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. రాజస్తాన్‌(0.273) కంటే నెట్‌ రన్‌రేటు పరంగా చెన్నై మెరుగైన స్థితిలో ఉంది.

రెండో స్థానం కోసం పోటీ
మరోవైపు నాలుగో స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో మొత్తం 18 పాయింట్లు అవుతాయి. కాబట్టి రాజస్తాన్‌ తమకు మిగిలిన మరో మ్యాచ్‌ భారీ తేడాతో గెలిస్తేనే రెండో స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది. లేదంటే మిగతా జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

రాజస్తాన్‌ వర్సెస్‌ పంజాబ్‌ స్కోర్లు:
👉వేదిక: బర్సపరా క్రికెట్‌ స్టేడియం.. గువాహటి
👉టాస్‌: రాజస్తాన్‌.. బ్యాటింగ్‌

👉రాజస్తాన్‌ స్కోరు: 144/9 (20)
👉పంజాబ్‌ స్కోరు: 145/5 (18.5)

👉ఫలితం: రాజస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సామ్‌ కరన్‌(పంజాబ్‌ కెప్టెన్‌.. 2/24, 41 బంతుల్లో 63 నాటౌట్‌).

చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్‌ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్‌ ఫైర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement