IPL 2022: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!

Glenn Maxwell Set To Miss Start Of IPL 2022 Due To His Wedding - Sakshi

ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వేలం కంటే ముందే ఆటగాళ్ల రిటెన్షన్ లో భాగంగా అట్టిపెట్టుకున్న స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్.. వ్యక్తిగత కారణాల (వివాహం) చేత లీగ్ ప్రారంభ మ్యాచ్లకు దూరమవుతాడని తెలుస్తోంది. 


మార్చి 27న మ్యాక్స్ వెల్.. తన ప్రేయసి, భారత సంతతికి(తమిళనాడు) చెందిన వినీ రామన్‌ను మనువాడబోతున్నాడు. వీరిరువురు 9 ఏళ్ల ప్రేమ ప్రయాణానికి స్వస్తి పలుకుతూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. వీరి వివాహం త‌మిళ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం మెల్‌బోర్న్‌లో జరగనుంది. తమిళంలో ముద్రించిన వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే నెట్టింట రచ్చ చేస్తుంది.

ఇదిలా ఉంటే, గత సీజన్‌తోనే ఆర్సీబీలోకి ఎంట్రీ ఇచ్చిన మ్యాక్సీ.. రెండు దశల్లోనూ రాణించి, జట్టు ప్లే ఆఫ్స్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో, ఆర్సీబీ  అతన్ని రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అన్నీ కుదిరితే కెప్టెన్సీ కట్టబెట్టేందుకు కూడా ఆర్సీబీ  రెడీ అయ్యింది. అయితే, వివాహం కారణం మ్యాక్సీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండడంతో ఆర్సీబీ ఈ విషయమై పునరాలోచనలోపడింది. కాగా, ఐపీఎల్ 2022 సీజన్ ను మార్చి చివరి వారంలో ప్రారంభించేందుకు నిర్వాహకులు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు, మార్చి 29 నుంచి ఆసీస్.. పాకిస్థాన్లో పర్యటించనున్న విషయం విధితమే. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా.. మూడు టెస్ట్‌లతో పాటు వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్ లు కూడా  ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. వివాహం కారణంగా మ్యాక్సీ పాక్ పర్యటనకు దూరంగా ఉంటానని ఇదివరకే ప్రకటించాడు.
చదవండి: వీరేంద్ర సెహ్వాగ్, భువనేశ్వర్ కుమార్ భాటలో ఆరోన్ ఫించ్..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top