బ్యాట్‌ విసిరేసిన గేల్‌..

Gayle Throws Away His Bat In Frustation - Sakshi

అబుదాబి: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌  పంజాబ్‌ ఓటమి పాలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో గేల్‌ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ నాల్గో బంతికి గేల్‌ బౌల్డ్‌ అయ్యాడు. బంతి బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో అసహనానికి గురైన గేల్‌ బ్యాట్‌ను విసిరేశాడు. సెంచరీ ముందు ఔట్‌ కావడంతో గేల్‌ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఇలా నెర్వస్‌ నైన్టీస్‌లో పెవిలియన్‌ చేరడం, అందులోనే కేవలం​ పరుగు మాత్రమే కావాల్సిన తరుణంలో బౌల్డ్‌ కావడంతో గేల్‌  ఆ కోపాన్ని బ్యాట్‌పై చూపించాడు. ఆ తర్వాత తేరుకున్న గేల్‌ బ్యాట్‌ తీసుకుని వెళ్లి ఆర్చర్‌ను అభినందించాడు. 

కింగ్స్‌ పంజాబ్‌ నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 17.3 ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్‌స్టోక్స్‌(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్‌((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్‌ ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్‌ స్మిత్‌(31 నాటౌట్‌; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్‌( 22 నాటౌట్‌;11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ ఇంకా ఓవర్‌ ఉండగానే విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్తాన్‌ విజయం సాధించినట్లయ్యింది.  లక్ష్య ఛేదనలో స్టోక్స్‌, ఊతప్పలు రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ప్రధానం స్టోక్స్‌ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. కాగా, హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్‌ ఔట్‌ కాగా, ఊతప్ప, సంజూ శాంసన్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. శాంసన్‌ కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు.  ప్రతీ వికెట్‌కు విలువైన భాగస్వామ్యం సాధించడంతో రాజస్తాన్‌ అవలీలగా గెలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top