‘టీ20’ని మార్చండి: సునీల్‌ గావస్కర్‌

Gavaskar Suggests Two Bouncers Per Over In T20s - Sakshi

దుబాయ్‌: టీ20 ఫార్మాట్‌లో మార్పులు అనివార్యమని అంటున్నాడు దిగ్గజ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సునీల్‌ గావస్కర్‌. టీ20 క్రికెట్‌ అనేది ఇప్పటికీ బ్యాట్స్‌మెన్‌ గేమ్‌గానే ఉందని, దాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానమైన పోరు జరగాలంటే ఈ ఫార్మాట్‌లో మార్పులు చేయకతప్పదన్నాడు. ప్రధానంగా పేస్‌ బౌలర్‌కు ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే నిబంధనను జత చేర్చాలన్నాడు. బౌండరీలే లక్ష్యంగా బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడే టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఉన్న ఒక బౌన్సర్‌ను రెండుగా మార్చాలన్నాడు. అదే సమయంలో బౌండరీ లైన్‌ దూరాన్ని పెంచాలన్నాడు.  చిన్న గ్రౌండ్‌లలో బౌండరీ లైన్‌ దూరం తగ్గుతుందనే విషయాన్ని గావస్కర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. అలా కాకుండా టీ20ల్లో అన్ని మ్యాచ్‌లకు ఒకే తరహా బౌండరీ లైన్‌ను ఏర్పాటు చేయాలని, అది గరిష్టంగా ఇంత ఉండాలని నియమాన్ని తీసుకురావాలన్నాడు. (చదవండి: శాంసన్‌ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?)

అప్పుడే బౌలర్‌పై ఒత్తిడి తగ్గి బ్యాటింగ్‌, బౌలింగ్‌ మధ్య సమ పోరు నడుస్తుందని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. యూఏఈ నుంచి పీటీఐతో మాట్లాడిన గావస్కర్‌.. టీ20 ఫార్మాట్‌ అనేది అద్భుతమని, కానీ ఆ ఫార్మాట్‌కు మరిన్ని హంగులు తీసుకువస్తే ఇంకా మజా ఉంటుందన్నాడు. ‘ఇది బ్యాట్స్‌మెన్‌ ఫార్మాట్‌. దాంతో ఫాస్ట్‌ బౌలర్లకు ఓవర్‌కు రెండు బౌన్సర్లు ఇవ్వాలి. గ్రౌండ్‌ అథారిటి కోరుకుంటే బౌండరీ లైన్‌ను పెద్దది చేయడం కష్టం కాదు. ఇప్పటివరకూ ఒక బౌలర్‌కు నాలుగు ఓవర్లు ఉన్న నిబంధనను మారిస్తే బాగుంటుంది. ఒక బౌలర్‌ తన తొలి మూడు ఓవర్లలో ఒక వికెట్‌ తీస్తే అతనికి ఎక్స్‌ట్రా ఓవర్‌ను ఇవ్వాలి. సదరు బౌలర్‌ కోటాలో ఐదు ఓవర్లు చేర్చాలి. ఇక నాన్‌ స్టైకర్‌లో ఉండే ఆటగాడు బౌలర్‌ బంతిని వేయడానికి ముందే క్రీజ్‌ను దాటి బయటకి వెళ్లిపోతున్నాడనే అనే అంశాన్ని పరిశీలించే అధికారం థర్డ్‌ అంపైర్‌కు ఉండాలి.ఇక బౌలర్‌ నాన్‌స్టైకర్‌ ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ను మన్కడింగ్‌ చేస్తే అది ఔటే కాకుండా పెనాల్టీని కూడా బ్యాట్స్‌మన్‌కు విధించాలి. ఒకవేళ బౌలర్‌ బంతి రిలేజ్‌ చేయకుండానే నాన్‌స్టైకర్‌ బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌ను దాటిసే, ఆ బంతిని అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ ఫోర్‌ కొడితే దానికి వన్‌ షార్ట్‌ పెనాల్టీ తీసుకురావాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top