‘ఈ దెబ్బతో మరో స్థాయికి ఐపీఎల్‌’ | Ganguly Says IPL Bigger Than Other Premier League Like NBA And EPL | Sakshi
Sakshi News home page

Sourav Ganguly: ‘ఈ దెబ్బతో మరో స్థాయికి ఐపీఎల్‌’

Mar 25 2026 8:14 AM | Updated on Mar 25 2026 9:05 AM

Ganguly Says IPL Bigger Than Other Premier League Like NBA And EPL

ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్‌), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆ‍ర్సీబీ) రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2008లో ఆరంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌లుగా పేరు పొందిన ఎన్‌బీఏ, ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ స్థాయికి సమానంగా నిలిచిందని వ్యాఖ్యానించాడు.

ఇది ఐపీఎల్‌కు దక్కిన అరుదైన గౌరవమని చెప్పుకొచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘ఇది  ఐపీఎల్‌కు నిజంగా శుభవార్త.  2008లో తొలిసారి నేను ఐపీఎల్ మ్యాచ్ ఆడేటప్పుడే రానున్న కాలంలో ఈ లీగ్ అత్యంత ఖరీదైనగా మారుతుందని చెప్పాను. ఇప్పుడు నా మాటలు అక్షరాల నిజమయ్యాయి. 18 సీజన్‌లు ముగించుకొని 19వ సీజన్‌కు విజయవంతంగా అడుగుపెట్టిన ఐపీఎల్  ఈ స్థాయికి  చేరుకోవడం గొప్ప విషయం. 

నా దృష్టిలో ఐపీఎల్ కూడా ఎన్‌బీఏతో  సమానం. ఐపీఎల్ ప్రసార హక్కులు ఇప్పుడు  ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్‌) కూడా దాటేశాయి. సంవత్సరానికి కేవలం రెండున్నర నుంచి మూడు నెలలు మాత్రమే ఆడే ఒక స్పోర్ట్స్ ఫ్రాంచైజీని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి.’ అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కాల్‌ సోమాని కన్సార్టియమ్‌ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్‌ టీమ్‌లో 100 శాతం వాటాను దక్కించుకుంది.  మరోవైపు లీగ్‌ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ (యూఎస్‌ఎల్‌) సంస్థ నుంచి రూ. 16,706 కోట్ల ధరకు ఆదిత్యా బిర్లా గ్రూప్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బోల్డ్‌ వెంచర్స్‌, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్‌ సంస్థలు దక్కించుకున్నాయి. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్‌ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి.  

చదవండి: పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement