పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి! | Captaincy Controversy Deepens At Mumbai Indians As Calls Grow To Replace Hardik With Rohit Sharma Or Suryakumar Yadav | Sakshi
Sakshi News home page

IPL 2026: పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాలి!

Mar 23 2026 8:58 AM | Updated on Mar 23 2026 9:25 AM

Former Cricketer Suggest Hardik Pandya Say No-To-MI Captaincy IPL 2026

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ది ఘనమైన చరిత్ర. ఐపీఎల్‌ చరిత్రలో ఐదు టైటిల్స్‌ కొల్లగొట్టిన ముంబై ఇండియన్స్‌కు అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుంది. 2020లో చివరిసారి చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ అప్పటినుంచి మరోసారి టైటిల్‌ గెలవలేకపోయింది. నాలుగేళ్లలో మూడుసార్లు లీగ్‌ దశకే (2021, 2022, 2024) పరిమితమైన ముంబై 2023, 2025 సీజన్‌లో మాత్రం ప్లేఆఫ్స్‌ చేరింది. 

కానీ ఆరోసారి టైటిల్‌ మాత్రం గెలుచుకోలేకపోయింది. ముంబై టైటిల్ గెలిచిన ఐదుసార్లు కెప్టెన్‌గా రోహిత్ శర్మనే ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా విజయవంతమైన హిట్‌మ్యాన్ ఐపీఎల్‌లోనూ నాయకుడిగా అదే తరహా విజయాన్ని అందుకున్నాడు. అయితే 2024లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరాడు. 

పాండ్యాకు బాధ్యతలు..
ఆ సీజన్‌లో రోహిత్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యాను కెప్టెన్ చేశారు. అప్పట్లో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మైదానంలోనే హార్దిక్ పాండ్యాను గేలి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనికి తోడు ముంబై ఇండియన్స్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 

పెరిగిన విమర్శలు..
దీంతో పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు పెరిగిపోయాయి. అయితే 2025 సీజన్‌లో ముంబై పరిస్థితి కాస్త కుదుటపడింది. పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్ చేరుకుంది.  అయితే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కూడా మరోసారి కెప్టెన్సీ విషయంలో ముంబై అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ లేదా రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. 

ఈ నేపథ్యంలోనే భారత మాజీ బ్యాటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ముంబై ఇండియన్స్‌కెప్టెన్సీ విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా తన కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్‌కు అప్పగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ‘కెప్టెన్సీ మార్పుతోనే ముంబై ఇండియన్స్ గాడిన పడుతుందేమో. కెప్టెన్సీ విషయంలో జట్టు యాజమాన్యం రోహిత్‌, సూర్యకుమార్‌, హార్దిక్ పాండ్యాలతో కలిసి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది.  

నిజానికి పాండ్యా మంచి కెప్టెనే కావొచ్చు.. కానీ జట్టులో భారత్‌కు రెండు టీ20 ప్రపంచకప్‌లు అందించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు. నాయకత్వ మార్పు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాబట్టి ముంబై యాజమాన్యం ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. కెప్టెన్ మారితే జట్టు అదృష్టం మారే అవకాశం లేకపోలేదు. అందుకే సూర్యకుమార్‌కు పాం‍డ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే  బాగుంటుంది.

సూర్య అయితే బాగుంటుంది..
అయితే కెప్టెన్ ఎవరనే  అంతిమ నిర్ణయం ఫ్రాంచైజీదే. పాండ్యాను కాదనుకుంటే సూర్యకుమార్‌కు బాధ్యతలు అప్పగించొచ్చు. కానీ అది ముంబై ఇండియన్స్ అంతర్గత వ్యవహారం. కాబట్టి వాళ్లంతా కలిసి కూర్చోని మాట్లాడుకొని సమస్యకు ముగింపు పలకాలి. నా వరకు సూర్యకుమార్  కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించగలడు’ అని చెప్పుకొచ్చాడు. 

ఇటీవలే టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ అందించాడు. దీంతో హార్దిక్‌పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్‌కు అప్పగించాలని బీసీసీఐ మాజీ సెలెక్టర్లు కూడా పిలుపునిచ్చారు. ఇక ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న కేకేఆర్‌తో ఆడనుంది.

చదవండి: పీఎస్‌ఎల్‌ద్దు.. ఐపీఎల్‌ ముద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement