ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ రేసుపై అనుమానాలు | Fans raise doubts on IPL 2026 playoff race | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ రేసుపై అనుమానాలు

May 18 2026 7:43 AM | Updated on May 18 2026 9:05 AM

Fans raise doubts on IPL 2026 playoff race

ఐపీఎల్‌ 2026 ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. భారీ అంచనాలు కలిగిన జట్లు అనూహ్యంగా వెనుకబడ్డాయి. అంతా అయిపోయిందనుకున్న జట్లు ఊహించని విజయాలు సాధిస్తూ ఆశలు సజీవంగా ఉంచుకున్నాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. తెరవెనుకు ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు రావడానికి పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఉదంతాలే కారణం.  

సీజన్‌ ప్రారంభంలో 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడటాన్ని ఫ్యాన్స్‌ అసహజంగా భావిస్తున్నారు. సీజన్‌ను నాలుగు వరుస విజయాలతో ఘనంగా ప్రారంభించి, ఈసారి టైటిల్‌ పక్కా అనుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో అనూహ్యంగా వెనుకపడిపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

మరోవైపు అంతా అయిపోయిందనుకున్న సీఎస్‌కే, కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ లాంటి జట్లు అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడటం.. ఈ జట్లు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైందనుకున్న జట్లకు ఊహించని షాకులివ్వడం​ ఏదో పథకం ప్రకారమే జరుగుతుందన్న సంకేతాన్నిస్తుంది. క్రీడల్లో అంచనాలకు విరుద్దంగా జరగడం సహజమే అయినప్పటికీ, మరీ ఇంతలా డ్రామా జరగడాన్ని ఫ్యాన్స్‌ అనుమానిస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్‌, రాజస్థాన్‌ లాంటి జట్లు కీలక దశ వచ్చే సరికి ఒక్క విజయం కోసం ముఖం​ వాయడమేంటని ముక్కునవేళ్లేసుకుంటున్నారు. ఎంత లయ తప్పినా మరీ ఇంతలా విజయం కోసం కరువు పడటమేంటని చర్చించుకుంటున్నారు. పంజాబ్‌ వరుసగా డబుల్‌ హ్యాట్రిక్‌ పరాజయాలు, రాజస్థాన్‌ హ్యాట్రిక్‌ పరాజయాలు మూటగట్టుకొని ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న వైనాన్ని ఆయా ఫ్రాంచైజీల అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

బెట్టింగ్‌ల కోసం ఫ్రాంచైజీలు తమ మనోభావాలతో అడుకుంటున్నాయా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆటగాళ్ల కదలికలు, వారి ఆటతీరులో అనూహ్య మార్పులను సూచిస్తూ ఏదో జరుగుతుందని నిర్దారించుకుంటున్నారు. WWE తరహాలా ఐపీఎల్‌ కూడా స్క్రిప్టెడ్‌గా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ పరిణామాలు యాధృచ్చికంగా జరిగినా వీటిని నమ్మే పరిస్థితుల్లో అస్సలు లేరు. 

వరుసగా ఆరు విజయాలు సాధించిన జట్టు.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఐపీఎల్‌ను ఓ డ్రామాగా డిసైడ్‌ చేశారు. ఈ సీజన్‌లో మున్ముందు మరిన్ని సిత్రాలు చూడాల్సి ఉంటుందని ఫిక్స్‌ అయిపోయారు. నిష్క్రమణ అంచుల్లో ఉన్న ఢిల్లీ, కేకేఆర్‌ లాంటి జట్లు ప్లే ఆఫ్స్‌ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని డిసైడయ్యారు. అంచనాలు తారుమారు చేస్తే చీకటి వ్యాపారం​ లక్షల కోట్లల్లో జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా, ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. మిగతా 3 బెర్త్‌ల కోసం అధికారికంగా ఏడు జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఏమైనా జరగొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

మరో బెర్త్‌ కోసం పంజాబ్‌, రాజస్థాన్‌, సీఎస్‌కే మధ్య డూ ఆర్‌ డై ఫైట్‌ నడుస్తుంది. ఈ జట్లు ఇకపై ఒక్క మ్యాచ్‌ ఓడినా, ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తాయి. ఢిల్లీ, కేకేఆర్‌ సైతం ఏవైనా అద్భుతాలు జరిగితే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సీజన్‌ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రేసు సినిమా డ్రామాను మించిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement