‘కామన్‌సెన్స్ లేదు.. అతడిని పక్కనబెట్టడమే మంచిది’ | Ex-Player Kaif-Criticized Pant-Played-Without-Common-Sense-Vs SL-1st Test | Sakshi
Sakshi News home page

‘కామన్‌సెన్స్ లేదు.. అతడిని పక్కనబెట్టడమే మంచిది’

Aug 17 2026 7:56 AM | Updated on Aug 17 2026 9:23 AM

Ex-Player Kaif-Criticized Pant-Played-Without-Common-Sense-Vs SL-1st Test

Photo Credit: BCCI Twitter

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 39 పరుగులతో టచ్‌లో కనిపించినప్పటికీ మరోసారి నిర్లక్ష్యంతో వికెట్ పారేసుకొని విమర్శలు మూటగట్టుకున్నాడు. 

ముఖ్యంగా లంక ఆఫ్ స్పిన్నర్ కెషారా నువంతా తెలివిగా ఫ్లైటెడ్ డెలివరీలు వేసి పంత్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో పంత్ కనీసం కామన్‌సెన్స్ ఉపయోగించకుండా బ్యాటింగ్ చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. 

‘రిషబ్ పంత్ ఔట్ విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. అతని ఆట విధానమే అలా ఉంటుంది. కానీ నా కంప్లైంట్ ఏంటంటే పంత్ కామన్‌సెన్స్ లేకుండా ఆడడమే. లంక జట్టు కొత్త బంతి తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ కెషారా తెలివిగా ఫ్లైటెడ్ బంతులను డెలివరీ చేశాడు. అప్పటికే మూడుసార్లు కట్‌షాట్ ఆడేందుకు ప్రయత్నించి పంత్ విఫలమయ్యాడు. 

కానీ పంత్ ఇక్కడే కామన్‌సెన్స్ మరిచిపోయాడు. కొత్త బంతిని ఐదు నుంచి ఆరు ఓవర్ల దాకా జాగ్రత్తగా ఆడాలి. ఇది టెస్టు మ్యాచ్ అన్న సంగతి మరిచిపోయి అనవసర షాట్లకు యత్నించి పంత్ వికెట్ పారేసుకున్నాడు. అతను ఓవర్‌లోని మొదటి బంతికే అలా దూకుడుగా ఆడటం చూసి నేను ఆశ్చర్యపోయాను.  ఒక బ్యాటర్ 150 పరుగుల వద్ద ఉన్నప్పటికీ, కొత్త బంతి వచ్చినప్పుడు మరికొన్ని బంతులు ఆడతాడు. 

ఆ విషయంలో పంత్‌ను తప్పుబట్టాల్సిందే. లాజిక్ లేకుండా ఆడుతూ క్రికెట్ పరిజ్ఞానంలో పంత్‌ చాలా వెనుకబడిపోయాడనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిమానులు కూడా పంత్ నిర్లక్ష్యపు ఆటతీరును విమర్శించారు. పంత్‌ను పక్కనబెట్టి సర్ఫరాజ్‌కు అవకాశమివ్వడం మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులతో రెండో  రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రోజు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. సెంచరీ చేసిన పడిక్కల్ (167 పరుగులు) కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేయగా, ధ్రువ్ జురెల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (12), ప్రసిధ్ క్రిష్ణ (1) క్రీజులో ఉన్నారు. ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement