Euro Cup: పోర్చుగల్ ఔట్.. రొనాల్డో భావోద్వేగం

సెవిలా: యూరో కప్ 2020 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ అనూహ్యంగా వైదొలిగింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 0-1 తేడాతో ఓటమిపాలై తమ అభిమానులను షాక్‌కు గురి చేసింది. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బెల్జియం.. తర్వాత ప్రత్యర్థికి సమం చేసే అవకాశం ఇవ్వకుండా ఆటను ముగించింది. తమ జట్టు అనూహ్య రీతిలో టోర్నీ నుంచి వైదొలగడంతో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అసహనంతో తన ఆర్మ్ బ్యాండ్‌ను నేలకేసి కొట్టాడు. కెరీర్‌లో తన చివరి యూరో కప్‌లో ఆడిన రొనాల్డోకు ప్రిక్వార్టర్స్‌లోనే తన జట్టు ఇంటి దారి పట్టడం అస్సలు మింగుడు పడలేదు.
Nahhh mannn, Possibly the last every time we see Ronaldo at the EUROS😢😢😢 pic.twitter.com/1aPQVOLr0F
— Dhruvzzz (@dhruvzz8) June 27, 2021
కాగా, ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న రొనాల్డో.. నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతే కాదు, టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. యూరో కప్‌లో అతను మొత్తం 14 గోల్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇదే టోర్నీలో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్(109 గోల్స్) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇరాన్‌కు చెందిన అలీ డేయీ(109 గోల్స్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రిక్వార్టర్స్‌లో అతను ఒక్క గోల్ చేసుంటే తన జట్టును గట్టెక్కించడంతో పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు.
చదవండి: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు..