ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్, జర్మనీ | Sakshi
Sakshi News home page

ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్, జర్మనీ

Published Fri, Jun 25 2021 4:10 AM

Portugal, Germany in the pre-quarters in Euro Cup - Sakshi

బుడాపెస్ట్‌: యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పోర్చుగల్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్‌ జట్లు కూడా నాకౌట్‌ దశకు చేరాయి. గ్రూప్‌ ‘ఎఫ్‌’లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పోర్చుగల్, ఫ్రాన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. 31వ, 60వ నిమిషాల్లో అతను రెండు గోల్స్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ జట్టులో కరిమ్‌ బెన్‌జిమా ఇంజూరి టైమ్‌ (45+2వ ని.)లో, 47వ నిమిషంలో రెండు గోల్స్‌ చేశాడు.

ఇదే గ్రూప్‌లో ఉన్న జర్మనీ... హంగేరితో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను కూడా 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఐదు పాయింట్లతో ఫ్రాన్స్‌ ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలవగా... నాలుగు పాయింట్లు సాధించిన జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. పోర్చుగల్‌ కూడా 4 పాయింట్లు సాధించినప్పటికీ... జర్మనీ చేతిలో ఓడటంతో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది.  టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూప్‌లో టాప్‌–2లో నిలిచిన జట్లు నేరుగా...  మూడో స్థానంలో నిలిచిన 6 జట్ల నుంచి మెరుగైన నాలుగు టీమ్‌లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. దాంతో పోర్చుగల్‌ కూడా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. శనివారం నుంచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి.

చరిత్రకు గోల్‌ దూరంలో రొనాల్డో
ఫుట్‌బాల్‌ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో గోల్‌ దూరంలో నిలిచాడు. యూరో కప్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన రొనాల్డో... అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ (దేశం తరఫున)లో ఇరాన్‌ ప్లేయర్‌ అలీ డయీ పేరిట ఉన్న అత్యధిక గోల్స్‌ (109) రికార్డును సమం చేశాడు. రొనాల్డో మరొక్క గోల్‌ సాధిస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement