ఇంగ్లండ్‌ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర శతకం | ENGW vs INDW: Smriti Mandhana Slams 51 Ball Maiden T20I Hundred | Sakshi
Sakshi News home page

IND vs ENG: స్మృతి మంధాన విధ్వంసకర శతకం.. టీ20లలో ఇదే మొదటిది

Jun 28 2025 8:24 PM | Updated on Jun 28 2025 9:12 PM

ENGW vs INDW: Smriti Mandhana Slams 51 Ball Maiden T20I Hundred

ఇంగ్లండ్‌తో తొలి టీ20లో భారత మహిళా జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుత శతకంతో మెరిసింది. ఆది నుంచి నిలకడగా ఆడిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ యాభై ఒక్క బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. 

కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో స్మృతికి ఇదే తొలి శతకం కావడం విశేషం. దీంతో ఆనందంలో మునిగిపోయిన స్మృతి హెల్మెట్‌ తీసి.. బ్యాట్‌ చూపిస్తూ నవ్వులు చిందిస్తూ సెలబ్రేట్‌ చేసుకుంది.

ఇంగ్లండ్‌ పర్యటనలో..
కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగనుండగా.. శనివారం నాటి తొలి మ్యాచ్‌లో టా​స్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (20) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. అయితే, మరో ఓపెనర్‌, కెప్టెన్‌ స్మృతి మంధాన.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది.

51 బంతుల్లో సెంచరీ
ఈ క్రమంలో స్మృతి మంధాన 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్లీన్‌ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్‌ (8) త్వరగానే పెవిలియన్‌ చేరగా.. జెమీమా రోడ్రిగెస్‌ డకౌట్‌ అయింది. ఇక స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి.. సోఫీ ఎక్లిస్టోన్‌ బౌలింగ్‌లో నాట్‌ సీవర్‌- బ్రంట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైంది.

ఇంగ్లండ్‌క్ష్యం 211
అమన్‌జోత్‌ కౌర్‌ 3, దీప్తి శర్మ ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక స్మృతి అద్భుత శతకం ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. ఎమ్‌ ఆర్లోట్‌, సోఫీ ఎక్లిస్టోన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

కాగా టీ20లలో భారత మహిళా జట్టుకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకు ముందు ముంబై వేదికగా వెస్టిండీస్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ వుమెన్‌ వర్సెస్‌ ఇండియా వుమెన్‌ తుదిజట్లు
ఇండియా
స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగెస్‌, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్‌ రాణా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి.

ఇంగ్లండ్‌
సోఫియా డంక్లీ, డానియెల్‌ వ్యాట్‌-హాడ్జ్‌, నాట్‌ సీవర్‌-బ్రంట్‌ (కెప్టెన్‌), టామీ బౌమౌంట్‌, ఎమీ జోన్స్‌ (వికెట్‌ కీపర్‌), అలిస్‌ కాప్సీ, సోఫీ ఎక్లిస్టోన్‌, ఎమ్‌ ఆర్లోట్‌, లారెన్‌ ఫిలర్‌, లిన్సీ స్మిత్‌, లారెన్‌ బెల్‌.

చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

Advertisement
 
Advertisement
Advertisement