ENG VS IND 2nd Test: భారీ డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌ | ENG VS IND 2nd Test Day 2: Gill Becomes First Asian Captain To Score A Double Hundred In SENA Countries | Sakshi
Sakshi News home page

ENG VS IND 2nd Test: భారీ డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌

Jul 3 2025 7:39 PM | Updated on Jul 3 2025 8:38 PM

ENG VS IND 2nd Test Day 2: Gill Becomes First Asian Captain To Score A Double Hundred In SENA Countries

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారీ డబుల్‌ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్‌ తర్వాత గిల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి డబుల్‌ సెంచరీ. ఈ మైలురాయిని గిల్‌ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్‌తో గిల్‌ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా.. 
సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా..
ఇంగ్లండ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. 
ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక స్కోర్‌ చేసిన భారత ఆటగాడిగా.. 
టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్‌గా.. 
విదేశాల్లో డబుల్‌ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్‌గా.. 
సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. 
టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్‌ చేసిన భారత కెప్టెన్‌గా పలు రికార్డులు సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ ఇప్పటికే భారీ స్కోర్‌ చేసేసింది. డబుల్‌ సెంచరీ తర్వాత కూడా గిల్‌ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్‌ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్‌దీప్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. టీ విరామం సమయానికి​ భారత్‌ స్కోర్‌ 565/7గా ఉంది.

310/5 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్..‌ లంచ్‌ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్‌ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. 

గిల్‌-జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో (42) కలిసి ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్‌ (87), కేఎల్‌ రాహుల్‌ (2), కరుణ్‌ నాయర్‌ (31), రిషబ్‌ పంత్‌ (25), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జోష్‌ టంగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement