
హైదరాబాద్: జాతీయ అండర్–9 చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన అదుళ్ల దివిత్ రెడ్డి కాంస్య పతకం సాధించాడు. హరియాణాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత దివిత్‌తోపాటు మరో ఐదుగురు 8.5 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు.
మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... దివిత్‌కు కాంస్య పతకం ఖరారైంది. 10 పాయింట్లతో సాతి్వక్ స్వయిన్ (ఒడిశా) విజేతగా అవతరించగా... 9.5 పాయింట్లతో ఆది్వక్ అభినవ్ కృష్ణ (కర్ణాటక) రన్నరప్‌గా నిలిచాడు. 150 మంది ప్లేయర్ల మధ్య స్విస్ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో మాత్రమే ఓడిపోయాడు.
గత ఏడాది నవంబర్‌లో ఇటలీలో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్ షిప్‌లో దివిత్ రెడ్డి అండర్–8 ఓపెన్ విభాగంలో... ఏప్రిల్‌లో అల్బేనియాలో జరిగిన ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ అండర్–8 ఓపెన్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. మరోవైపు బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సాయి అన్షిత 8.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది.
వ్రిత్తి అగర్వాల్‌కు కాంస్య పతకంభువనేశ్వర్: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పతకాల బోణీ చేసింది. తెలంగాణకు చెందిన వ్రిత్తి అగర్వాల్ మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఆదివారం జరిగిన 400 మీటర్ల ఫైనల్‌ను వ్రిత్తి 4 నిమిషాల 30.05 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. భవ్య సచ్‌దేవ (ఢిల్లీ; 4ని:26.66 సెకన్లు) స్వర్ణ పతకం... అదితి సతీశ్ హెగ్డే (మహారాష్ట్ర; 4ని:29.48 సెకన్లు) రజత పతకం గెల్చుకున్నారు.