పంత్‌ను తీసేద్దామనుకున్నారా? | Did LSG Decide To Release Rishabh Pant After Poor IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2026: పంత్‌ను తీసేద్దామనుకున్నారా?

Mar 23 2026 7:09 AM | Updated on Mar 23 2026 7:53 AM

Did LSG Decide To Release Rishabh Pant After Poor IPL 2025

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఒక ఆటగాడికి అంత ధర చెల్లించడం అదే తొలిసారి. అంతేకాదు కేఎల్‌ రాహుల్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే పంత్‌ మాత్రం గత సీజన్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. 

పంత్‌ తాను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 269 పరుగులు మాత్రమే చేయడమే గాక కెప్టెన్‌గా జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో పంత్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేయాలన్న ఆలోచన లక్నో సూపర్‌జెయింట్స్‌కు కలిగినట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. బ్యాటింగ్‌లో విఫలమైన పంత్‌ అటు కెప్టెన్‌గానూ విఫలం కావడంతో జట్టు నుంచి రిలీజ్‌ చేయాలని లక్నో యాజమాన్యం భావించిందట. 

ఖండించిన గోయెంకా..
అయితే ఒక్క సీజన్‌కే పంత్‌ను తప్పించడం సరికాదని మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేయాలనుకున్నట్లు వచ్చిన వార్తలను తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్‌ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్‌ గోయెంకా ఖండించారు. పంత్‌ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికీ అతన్ని జట్టు నుంచి తొలగించాలని ఎన్నడూ అనుకోలేదని తెలిపారు. 

‘నిజానికి గత సీజన్‌లో పంత్‌ కెప్టెన్‌ాా బాగానే చేశాడు. కానీ జట్టుకు కీలకమైన నలుగులు బౌలర్ల సేవలు కోల్పోతే అతడు మాత్రం ఏమి చేయగలడు. దీంతో పంత్‌ తన జట్టులో ఉన్న పరిమిత వనరులను ఉపయోగించుకొనే జట్టును సమర్థంగా నడిపించాడు. రిషబ్ పేలవ ప్రదర్శనతో జట్టు నుంచి తొలగిస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు చూసి నేను చాలాసేపు నవ్వుకున్నా. 

సోషల్ మీడియా కేవలం తమ వ్యూస్‌ను పెంచుకోవడం కోసమే ఇలాంటి కల్పిత వార్తలను సృష్టించే పనిలో పడ్డాయి. పంత్ చాలా అద్భుతమైన ఆటగాడు. ప్రతీ విషయంలో సూటిగా స్పష్టంగా ఉంటాడు. ఫ్రాంచైజీ కోసం నూటికి నూరుశాతం కష్టపడతాడు. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్సీకి వంద శాతం న్యాయం చేశాడు. ఒక ఆటగాడి నుంచి అంతకంటే ఎక్కువగా ఆశించలేము. ’ అని చెప్పుకొచ్చారు. ఇక పంత్ ఐపీఎల్‌లో 125 మ్యాచ్‌లాడి 3,553 పరుగులు సాధించాడు.

రాహుల్‌తో విభేదాలు..
2022లో ఐపీఎల్‌లో గుజరాత్ ఐటాన్స్‌తో కలిసి అరంగేట్రం చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరుకుంది. కేఎల్ రాహుల్ కూడా జట్టును సమర్థంగా నడిపించాడు. అయితే 2024 సీజన్‌లో కేఎల్ రాహుల్‌, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. 

దీనికి తోడు ఆ సీజన్‌లో లక్నో లీగ్ దశకే పరిమితమైంది. దీంతో కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయడంతో పాటు కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు.  ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

చదవండి: అభిమానుల కన్నీటి పర్యంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement