60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా! | Dhoni Says Will Try To Play IPL Till 60 Age Chat With Sivakarthikeyan Viral | Sakshi
Sakshi News home page

MS Dhoni: 60 ఏండ్లు వచ్చేదాకా ఆడుతా!

Mar 23 2026 1:06 PM | Updated on Mar 23 2026 1:36 PM

Dhoni Says Will Try To Play IPL Till 60 Age Chat With Sivakarthikeyan Viral

తనకు 60 ఏండ్లు వచ్చే వరకు ఐపీఎల్‌ ఆడతానని టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పేర్కొనడం చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం 44 ఏండ్లు ఉన్న ధోనికి ఐపీఎల్‌ 2026 సీజన్‌ ఆఖరిదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలిచి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో ధోని వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విషయంలోకి వెళితే.. ఆదివారం సీఎస్‌కే ఫ్యాన్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ హీరో శివకార్తికేయన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ధోని రిటైర్మెంట్‌ విషయమై శివకార్తికేయన్‌ మాట్లాడాడు. 

‘ధోని సార్‌ మీరు రిటైర్‌ అవ్వొద్దు. అలా చేస్తే చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులు బాధపడతారు. 44 ఏళ్ల వయసులోనూ మీరు యంగ్‌గానే కనిపిస్తున్నారు.కనీసం 60 సంవత్సరాల వరకైనా క్రికెట్‌ ఆడి మమ్నల్ని అలరించాలి’ అని పేర్కొన్నాడు. దీనిపై మహేంద్ర సింగ్‌ ధోని వెంటనే స్పందించాడు. 

‘రోజురోజుకు ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ కూడా తగ్గుతూ వస్తోంది. అయినా సరే 60 ఏళ్లు వచ్చే వరకు ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని ధోని చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే యాజమాన్యం తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసుకోవడంతో అది వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆడుతూ వస్తోన్న ధోనికిది 19వ సీజన్‌. 

ఇప్పటివరకు ధోని ఐపీఎల్‌లో 278 మ్యాచ్‌లాడి 5,349 పరుగులు సాధించాడు. 2024లో సీఎస్‌కే కెప్టెన్‌గా వైదొలగడానికి ముందు ఆ జట్టు సాధించిన ఐదు టైటిల్స్‌ అందించి జట్టు ప్రయాణంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ధోని పూర్థిస్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మున్ముందు తేలనుంది. అయితే సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ మాత్రం ఈ సీజన్‌కు ధోని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. 

అయితే ఫ్రాంచైజీ ట్రేడింగ్‌లో సంజూ శాంసన్‌ సీఎస్‌కేకు రావడంతో కీపింగ్‌ బాధ్యతలు అతడే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ధోనికిది చివరి సీజన్‌ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సీఎస్‌కే ట్రేడింగ్‌లో ఏరికోరి శాంసన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.

చదవండి: Delhi Capitals: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement