డిఫెండింగ్‌ చాంప్‌ క్రెజికొవా అవుట్‌ | Defending champ Krejcikova out of Wimbledon Grand Slam | Sakshi
Sakshi News home page

డిఫెండింగ్‌ చాంప్‌ క్రెజికొవా అవుట్‌

Jul 6 2025 4:18 AM | Updated on Jul 6 2025 4:18 AM

Defending champ Krejcikova out of Wimbledon Grand Slam

ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్, సినెర్‌

మూడో రౌండ్లో రిబాకినా ఓటమి 

వింబుల్డన్‌ టోర్నీ

లండన్‌: ఈ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో సీడెడ్‌ స్టార్ల పరాజయాల పరంపర కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, 17వ సీడ్‌ బార్బర క్రెజికొవా (చెక్‌ రిపబ్లిక్‌)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమెతో పాటు 11వ సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), 16వ సీడ్‌ కసట్కినా (ఆ్రస్టేలియా), లోకల్‌ స్టార్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌)ల ఆట కూడా ముగిసింది. టాప్‌సీడ్‌ సబలెంక, ఎనిమిదో సీడ్‌ స్వియాటెక్, ఏడో సీడ్‌ అండ్రీవా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌ చేరాడు. 11వ సీడ్‌ డిమినార్, 19వ సీడ్‌ దిమిత్రోవ్‌లు కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల చాంపియన్, టాప్‌ సీడ్‌ సినెర్‌ (ఇటలీ) 6–1, 6–3, 6–1తో స్పెయిన్‌కు చెందిన మార్టినెజ్‌పై వరుస సెట్లలో గెలుపొందాడు. డిమినార్‌ (ఆ్రస్టేలియా) 6–4, 7–6 (7/5), 6–3తో హొల్మ్‌గ్రెన్‌ (డెన్మార్క్‌)పై, దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–3, 6–4, 7–6 (7/0)తో సెబాస్టియన్‌ అఫ్‌నెర్‌ (ఆ్రస్టియా)పై, మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 6–3, 3–6, 6–2, 6–4 జేమే మునర్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించారు. 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియన్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌ చేరాడు. ఆరో సీడ్‌ జొకో 6–3, 6–0, 6–4తో కెక్మనోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు. 

క్రెజికొవా మూడో రౌండ్లోనే... 
చెక్‌ రిపబ్లిక్‌ స్టార్, 17వ సీడ్‌ క్రెజికొవా టైటిల్‌ నిలబెట్టుకునే పోరాటానికి పదో సీడ్‌ ఎమ్మా నవారో (అమెరికా) చెక్‌పెట్టింది. మూడో రౌండ్లో నవారో 2–6, 6–3, 6–4తో క్రెజికొవాను ఓడించింది. 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ క్రెజికొవాకు ఈ ఏడాది కలిసిరావడం లేదు. ఈ సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ ఆ్రస్టేలియా ఓపెన్‌కు గైర్హాజరైన ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. 

ఇప్పుడు ఇక్కడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీ నుంచి ని్రష్కమించింది. ఏనాడు వింబుల్డన్‌లో తొలిరౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయిన క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌) ఈ సారి ప్రిక్వార్టర్స్‌ చేరింది. ఆమె 7–6 (8/6), 6–3తో వింబుల్డన్‌ (2022) మాజీ చాంపియన్, ఆ్రస్టేలియా ఓపెన్‌ (2023) మాజీ రన్నరప్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌)ను కంగుతినిపించింది. దీంతో గతేడాది సెమీఫైనలిస్ట్‌ అయిన రిబాకినా ఆట ఈ సీజన్‌లో మూడో రౌండ్‌తోనే ముగిసింది. 

ఈ ఏడాది ఆ్రస్టేలియా, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో ప్రిక్వార్టర్స్‌ చేరిన రిబాకినా... ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచింది. ఓవరాల్‌గా వింబుల్డన్‌లోనే ఆమెకిది పేలవ ప్రదర్శన. ఇక్కడ 2021 నుంచి ఆడుతున్న ఆమె ఆ ఏడాది ప్రిక్వార్టర్స్‌ చేరింది. మరుసటి ఏడాది విజేతగా నిలిచింది. 2023, 2024లలో క్వార్టర్స్, సెమీస్‌ వరకు పోరాడింది.  

స్వియాటెక్, అండ్రీవా అలవోకగా... 
మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌), అండ్రీవా (రష్యా) సునాయాస విజయాలతో ప్రిక్వార్టర్స్‌ చేరారు. ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల చాంపియన్‌ స్వియాటెక్‌ 6–2, 6–3తో కొలిన్స్‌ (అమెరికా)పై విజయం సాధించగా, ఏడో సీడ్‌ మిర్ర అండ్రీవా (రష్యా) కూడా 6–1, 6–3తో హెయిలీ బాప్టిస్ట్‌ (అమెరికా)పై వరుస సెట్లలో నెగ్గింది. ఈ సీజన్‌ ఆ్రస్టేలియా, ఫ్రెంచ్‌ ఓపెన్‌ల రన్నరప్‌ ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంక (బెలారస్‌) 7–6 (8/6), 6–4తో రాడుకానుపై గెలుపొందింది. ­

భారత జోడీలకు నిరాశ
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకీ బాంబ్రీ తన అమెరికా భాగస్వామితో కలిసి మూడో రౌండ్లోకి దూసుకెళ్లగా, రిత్విక్‌ బొల్లిపల్లి, శ్రీరామ్‌ బాలాజీ జోడీలకు రెండోరౌండ్లో చుక్కెదురైంది. యూకీ బాంబ్రీ–రాబర్ట్‌ గాలొవే (అమెరికా) ద్వయం 6–3, 7–6 (8/6)తో నునొ బోర్జెస్‌ (పోర్చుగల్‌)–మార్కస్‌ గిరోన్‌ (అమెరికా) జంటపై గెలిచింది. 

రిత్విక్‌–నికోలస్‌ బారియెంటోస్‌ (కొలంబియా) జోడీ 4–6, 6–7 (7/9)తో ఆరో సీడ్‌ జో సలిస్‌బురి–నియోల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జంట చేతిలో ఓటమి పాలైంది. శ్రీరామ్‌ బాలాజీ–మిగెల్‌ రెయిస్‌ (మెక్సికో) ద్వయం 4–6, 4–6తో నాలుగో సీడ్‌ మార్సెల్‌ గ్రెనొల్లర్స్‌ (స్పెయిన్‌)–హొరాసియో జె»ొల్లస్‌ (అర్జెంటీనా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement