దీప్తి సిక్సర్‌... లండన్‌ విన్నర్‌ | Deepti Sixer London Winner | Sakshi
Sakshi News home page

The Women hundred: దీప్తి సిక్సర్‌... లండన్‌ విన్నర్‌

Aug 19 2024 4:20 AM | Updated on Aug 19 2024 7:30 AM

Deepti Sixer London Winner

మహిళల హండ్రెడ్‌ టోర్నీ ఫైనల్లో మెరిసిన భారత ఆల్‌రౌండర్‌

‘సిక్స్‌’తో లండన్‌ స్పిరిట్‌ జట్టును గెలిపించిన దీప్తి శర్మ  

లండన్‌: ‘హండ్రెడ్‌’ మహిళల క్రికెట్‌ టోర్నీకి అద్భుత ముగింపు లభించింది.  ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో లండన్‌ స్పిరిట్‌ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఆధ్వర్యంలో 2021లో హండ్రెడ్‌ టోర్నీ (ఇన్నింగ్స్‌కు 100 బంతులు) మొదలైంది. 

విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హీతెర్‌ నైట్‌ సారథ్యంలోని లండన్‌ స్పిరిట్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో టామీ బీమోంట్‌ నాయకత్వంలోని వెల్ష్ ఫైర్‌ జట్టును ఓడించింది. 

లండన్‌ స్పిరిట్‌ జట్టుకు టైటిల్‌ దక్కడంలో భారత క్రికెటర్‌ దీప్తి శర్మ (16 బంతుల్లో 16 నాటౌట్‌; 1 సిక్స్‌) కీలకపాత్ర పోషించింది. లండన్‌ జట్టు విజయానికి చివరి 5 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. వెల్ష్ ఫైర్‌ జట్టు బౌలర్, విండీస్‌ ఆల్‌రౌండర్‌ హీలీ మాథ్యూస్‌ చివరి ఐదు బంతులు వేయడానికి వచ్చింది. 

తొలి బంతికి దీప్తి... రెండో బంతికి చార్లీ డీన్‌ చెరో సింగిల్‌ తీశారు. దాంతో లండన్‌ విజయ సమీకరణం 3 బంతుల్లో 4 పరుగులుగా మారింది. ఈ దశలో హీలీ వేసిన మూడో బంతిని దీప్తి శర్మ సిక్సర్‌గా మలిచి లండన్‌ విజయాన్ని ఖరారు చేసింది. రెండు బంతులు మిగిలి ఉండగా లండన్‌ స్పిరిట్‌ చాంపియన్‌గా అవతరించింది. 

అంతకుముందు వెల్ష్ ఫైర్‌ జట్టు 100 బంతుల్లో 8 వికెట్లకు 115 పరుగులు సాధించింది. జెస్‌ జొనాసెన్‌ (41 బంతుల్లో 54; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా... టామీ బీమోంట్‌ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు), హీలీ మాథ్యూస్‌ (26 బంతుల్లో 22; 3 ఫోర్లు) రాణించారు. లండన్‌ స్పిరిట్‌ బౌలర్లలో ఇవా గ్రే, సారా గ్లెన్‌ రెండు వికెట్ల చొప్పున తీయగా... దీప్తి శర్మ, తారా నోరిస్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. 

అనంతరం లండన్‌ స్పిరిట్‌ జట్టు 98 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. జార్జియా రెడ్మెన్‌ (32 బంతుల్లో 34; 3 ఫోర్లు), హీతెర్‌ నైట్‌ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు), డానియెలా గిబ్సన్‌ (9 బంతుల్లో 22; 5 ఫోర్లు) దూకుడుగా ఆడారు. వెల్ష్ ఫైర్‌ జట్టు బౌలర్లలో షబ్నిమ్‌ మూడు వికెట్లు పడగొట్టింది. గత ఏడాది విజేతగా నిలిచిన సదరన్‌ బ్రేవ్‌జట్టులో భారత జట్టు వైస్‌ కెప్టెన్, ఓపెనర్‌ స్మృతి మంధాన సభ్యురాలిగా ఉండటం విశేషం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement