జింబాబ్వే కోచ్‌గా బౌలింగ్‌ దిగ్గజం | Courtney Walsh Appointed Zimbabwe Bowling Coach After Impressive T20 World Cup Run, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జింబాబ్వే కోచ్‌గా బౌలింగ్‌ దిగ్గజం

Jul 2 2026 12:06 PM | Updated on Jul 2 2026 2:03 PM

Courtney Walsh appointed bowling coach of Zimbabwe

జింబాబ్వే క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం, వెస్టిండీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్‌ కోట్నీ వాల్ష్‌ నియమించబడ్డాడు. జూన్ 23న జరిగిన జింబాబ్వే క్రికెట్‌ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, జూలై 1న అధికారికంగా ప్రకటించారు.

ఈ ఏడాది భారత్–శ్రీలంక వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనే వాల్ష్ జింబాబ్వే బౌలింగ్ కన్సల్టెంట్‌గా పని చేశాడు. ఆయన మార్గదర్శకత్వంలో జింబాబ్వే అద్భుత ప్రదర్శన కనబరిచి ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లను ఓడించి తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా సూపర్-8 దశకు చేరడంతో పాటు 2028 టీ20 ప్రపంచకప్‌కు కూడా అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు తమ శాశ్వత బౌలింగ్‌ కోచ్‌గా వాల్ష్‌ను నియమించింది.

మరోవైపు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు మిగతా కోచింగ్‌ సిబ్బందిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించింది. హెడ్ కోచ్‌గా జస్టిన్‌ సమ్మన్స్‌ కొనసాగుతుండగా, అసిస్టెంట్ (బ్యాటింగ్) కోచ్‌గా డియాన్‌ ఇబ్రహీం, ఫీల్డింగ్ మరియు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కోచ్‌గా స్టువర్ట్‌ మత్య్సకెనరీ తమ బాధ్యతలను కొనసాగించనున్నారు.

కొత్తగా మాజీ ఆల్‌రౌండర్ చాము చిబాబను సీనియర్ టీమ్ మేనేజర్‌కు సహాయకుడిగా నియమించారు. అలాగే మాజీ కెప్టెన్ ఎల్టన్‌ చిగుంబర అండర్-19 జట్టు హెడ్ కోచ్‌గా కొనసాగనున్నారు.

ప్రస్తుతం జింబాబ్వే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో అన్ని ఫార్మాట్ల సిరీస్ ఆడుతోంది. కొత్త కెప్టెన్ రిచర్డ్‌ నగరవ నాయకత్వంలో ఆ జట్టు హరారే టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్‌  85 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement