నిన్న రహానే.. నేడు రోహిత్‌..

Controversial Decisions By Umpires In India Vs England Second Test Sparks Outrage In Social Media - Sakshi

చెన్నై: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో విజయాల సంగతి పక్కన పెడితే.. అంపైరింగ్‌ అపహాస్యానికి గురవుతున్నట్లు సుస్పష్టమవుతుంది. మ్యాచ్‌ తొలి రోజు రహానే విషయంలో జరిగిన పొరపాటే రెండో రోజు ఆటలో రోహిత్‌ శర్మ విషయంలోనూ పునరావృతం కావడం ఇంగ్లీష్‌ ఆటగాళ్లతో పాటు యావత్‌ క్రీడాభిమానులకు విస్మయాన్ని కలిగిస్తోంది.

ఫీల్డ్‌ అంపైర్‌ పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన థర్డ్‌ అంపైర్‌ కూడా అదే తప్పును రిపీట్‌ చేస్తే.. అది జట్టు జయాపజయాలపైనే కాకుండా అంపైరింగ్‌ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. రెండో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ ఎల్బీడబ్యూ విషయంలో ఇంగ్లండ్‌ రివ్యూ కోరింది. స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ వేసిన బంతి మిడిల్‌ స్టంప్‌ను తాకే దిశగా పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్‌ షాట్‌ అడే ప్రయత్నం చేశాడన్న కారణంగా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. 

రివ్యూ చూసిన థర్డ్‌ అంపైర్‌ బంతి ఆఫ్‌ స్టంప్‌ అవతలి నుంచి వెళ్తుందని కన్ఫర్మ్‌ చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో మాత్రం రోహిత్‌ ఎటువంటి షాట్‌కు ప్రయత్నించిన దాఖలాలు కనబడలేదు. బంతి మిడిల్‌ స్టంప్‌ను తాకుతుందని సుస్పష్టంగా తెలుస్తోంది. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై విస్మయానికి గురైన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విషయంపై వ్యాఖ్యాత సునీల్‌ గవాస్కర్‌ సైతం తన అసహనాన్ని తెలియజేశాడు.

కాగా, తొలి రోజు ఆటలో సైతం రహానే అంపై'రాంగ్‌' నిర్ణయం వల్ల బతికిపోయిన సంగతి తెలిసిందే. జాక్‌ లీచ్‌ వేసిన బంతి రహానే గ్లోవ్స్‌ను తాకుతూ వికెట్‌కీపర్‌ చేతుల్లోకి వెళ్లినట్లు రీప్లేలో స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై ఇంగ్లండ్‌ ఆటగాళ్లు రివ్యూకి వెళ్లగా.. థర్డ్‌ అంపైర్‌ కూడా పొరపాటు చేసి రహానేను నాటౌట్‌గా ప్రకటించాడు. థర్డ్‌ అంపైర్‌ ఎల్బీడబ్యూ యాంగిల్‌లోనే పరిశీలించి, క్యాచ్‌ అవుట్‌ విషయాన్ని విస్మరించాడు. ఏదిఏమైనప్పటికీ ఇటు వంటి అంపై'రాంగ్‌' నిర్ణయాలు ఆటగాళ్లలో తప్పుడు అభిప్రాయాన్నినింపేస్తాయి. 

ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 25 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత్‌, 195 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అశ్విన్‌ 5 వికెట్లతో రాణించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top