
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరింది. నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైంది. ఢిల్లీపై గెలుపుతో గుజరాత్‌తో పాటు ఆర్సీబీ, పంజాబ్ ఒకేసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్‌కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
పదోసారి
ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
యాదృచ్ఛికం
గుజరాత్ ఢిల్లీపై గెలవడంతో అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్సీబీ.. యాదృచ్ఛికంగా గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన రోజునే (మే 18) ఈ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మ్యాచ్ ఆడకుండా, గెలవకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కావడంపై ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ.. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.
కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తుంది. హేమాహేమీ జట్లకు షాకిస్తూ తొలి టైటిల్ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ సాధించిన విజయాలు రికార్డుల్లోకెక్కాయి. 17 ఏళ్ల తర్వాత సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఓడించిన ఆ జట్టు.. పదేళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో (వాంఖడే) మట్టికరిపించింది. ఇదే సీజన్‌లో కేకేఆర్‌ను కూడా వారి సొంత మైదానంలో (ఈడెన్ గార్డెన్స్) ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కేను, ముంబై ఇండియన్స్‌ను, కేకేఆర్‌ను వారి సొంత మైదానాల్లో ఓడించిన రెండో జట్టుగా (ఒకే సీజన్‌లో) రికార్డుల్లోకెక్కింది.
ఇదిలా ఉంటే, నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 5, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది.