‘టీమ్‌’ ఈవెంట్లలో మరో 2 పతకాలు | Sakshi
Sakshi News home page

‘టీమ్‌’ ఈవెంట్లలో మరో 2 పతకాలు

Published Fri, Mar 26 2021 6:22 AM

Chinky Yadav bags gold in ISSF World Cup shooting championship - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో ఏడో రోజు గురువారం భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో చింకీ యాదవ్, రాహీ సర్నోబత్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 17–7తో వార్జోనొస్కా, జులిటా బోరెక్, అగ్నీస్కా కొరెజ్వోలతో కూడిన పోలండ్‌ జట్టుపై గెలిచింది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ విభాగంలో అంజుమ్‌ మౌద్గిల్, శ్రేయ సక్సేనా, గాయత్రి నిత్యానందమ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 43–47తో అనెటా స్టాన్‌కివిచ్, అలెక్సాండ్రా, నటాలియా కొచనస్కాలతో కూడిన పోలండ్‌  చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత్‌ 10 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 21 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

‘మావాడితో కలిసి ఆడం’
ప్రత్యర్థి ఆటగాళ్లపైనో, వారి నిబంధనల ఉల్లంఘనపైనో మరో జట్టు ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం, పరిష్కారానికి నిర్వహకులు జోక్యం చేసుకోవడం చాలా టోర్నీలలో సహజంగా కనిపించే విషయం. అయితే అందుకు భిన్నంగా తమ జట్టు సహచరుడిపైనే మరొకరు ఫిర్యాదు చేసి అతనితో కలిసి బరిలోకి దిగేందుకు నిరాకరించడం విశేషం.  మరికొద్ది నిమిషాల్లో పోటీ అనగా... హంగేరీ షూటర్లు ఇస్తవాన్‌ పెని, జవన్‌ పెక్లర్‌ తమ తోటి షూటర్‌ పీటర్‌ సిడీ నిబంధనలకు విరుద్ధంగా ‘బైపాడ్‌’ అతికిచ్చి ఉన్న రైఫిల్‌తో పోటీలో పాల్గొంటున్నాడని ఆరోపిస్తూ తాము ఫైనల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిపై స్పందించిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ అధికారులు మాత్రం అతను నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా రూల్స్‌ విషయంలో తమకు హంగేరీ ప్లేయర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ ఘాటుగా స్పందించారు. అయితే నిబంధనలకంటే ఆటగాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. సిడీ 2000నుంచి వరుసగా 5 ఒలింపిక్స్‌లో పాల్గొనగా, ఇస్తవాన్‌ పెని ప్రస్తుతం వరల్డ్‌ నంబర్‌వన్‌గా ఉన్నా డు. తాజా వివాదంతో భారత్‌తో ఫైనల్లో పోటీ పడేందుకు అమెరికా అర్హత సాధించగా...ఫైనల్‌ను నేటికి వాయిదా వేశారు.  

Advertisement
Advertisement