చెన్నై చమక్‌... | Chennai Super Kings defeat Sunrisers Hyderabad by 7 wickets | Sakshi
Sakshi News home page

చెన్నై చమక్‌...

Apr 22 2023 2:24 AM | Updated on Apr 22 2023 2:24 AM

Chennai Super Kings defeat Sunrisers Hyderabad by 7 wickets - Sakshi

బాధ్యత లేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భంగపడింది. పటిష్టమైన బౌలింగ్, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో  ప్రత్యర్థిని కట్టడి చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ... సులభమైన లక్ష్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేదించింది. జడేజా స్పిన్‌ మ్యాజిక్, కాన్వే విలువైన ఫిఫ్టీతో చెన్నై ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది.  

చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై దూకుడు పెరుగుతోంది. హైదరాబాద్‌ను బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌ ఇలా అన్నిరంగాల్లో కట్టడి చేసిన సూపర్‌కింగ్స్‌ 7 వికెట్లతో జయభేరి మోగించింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. అనంతరం సూపర్‌ కింగ్స్‌ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (57 బంతుల్లో 77 నాటౌట్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచాడు. మార్కండేకు 2 వికెట్లు దక్కాయి. 

జడేజా మాయ... 
హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ను ఎక్కడికక్కడ చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. పవర్‌ ప్లేలో ఓపెనర్‌ హ్యారీ బ్రూక్‌ (13 బంతుల్లో 18; 3 ఫోర్లు) బౌండరీలతో వేగం పెంచినా... అంతలోనే ఆకాశ్‌ సింగ్‌ కళ్లెం వేశాడు. తర్వాత హిట్టర్‌ రాహుల్‌ త్రిపాఠి (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌) ఆడినా, కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (12 బంతుల్లో 12; 1 ఫోర్‌) బ్యాటింగ్‌కు దిగినా... క్లాసెన్‌ (16 బంతుల్లో 17; 1 ఫోర్‌) క్రీజులోకి వచ్చినా... నిలిచింది కాసేపే! ధాటైన ఇన్నింగ్స్, చితగ్గొట్టే ఓవర్‌ ఒక్కటైన కనిపించలేదు.

ఉన్నంతలో అభిషేక్‌ శర్మ చేసిన స్కోరే కాస్త మెరుగనిపించింది. అనుభవజు్ఞడైన స్పిన్నర్‌ జడేజా కీలకమైన అభిషేక్, రాహుల్‌ త్రిపాఠి, మయాంక్‌ అగర్వాల్‌ (2) వికెట్లతో సన్‌రైజర్స్‌ స్కోరు ఏమాత్రం పెరగకుండా అడ్డుకున్నాడు.  

కాన్వే ధనాధన్‌... 
చెన్నై ముందున్న సులువైన లక్ష్యాన్ని రుతురాజ్‌ గైక్వాడ్‌ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు) బౌండరీతో మొదలుపెట్టాడు. డెవాన్‌ కాన్వే ధనాధన్‌ ఆటతో పరుగులు వేగంగా వచ్చాయి. మార్కో జాన్సెన్‌ వేసిన ఆరో ఓవర్‌ను కాన్వే అదేపనిగా దంచేశాడు. ఎదుర్కొన్న 5 బంతుల్ని 4, 4, 6, 4, 4లుగా బౌండరీలకు తరలించడంతో 23 పరుగులొచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో చెన్నై స్కోరు 60/0.

టార్గెట్‌లో అటుఇటుగా సగం పనైపోయింది. 11వ ఓవర్లో రుతురాజ్‌ రనౌట్‌ కావడంతో 87 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన అజింక్య రహానే (10 బంతుల్లో 9; 1 ఫోర్‌), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అంబటి రాయుడు (9 బంతుల్లో 9; 1 ఫోర్‌) విఫలమైనా కాన్వే అజేయంగా నిలబడి జట్టును గెలిపించాడు. 

స్కోరు వివరాలు 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: బ్రూక్‌ (సి) రుతురాజ్‌ (బి) ఆకాశ్‌ 18; అభిషేక్‌ శర్మ (సి) రహానే (బి) జడేజా 34; రాహుల్‌ త్రిపాఠి (సి) ఆకాశ్‌ (బి) జడేజా 21; మార్క్‌రమ్‌ (సి) ధోని (బి) తీక్షణ 12; క్లాసెన్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరణ 17; మయాంక్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 2; జాన్సెన్‌ (నాటౌట్‌) 17; సుందర్‌ (రనౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–35, 2–71, 3–84, 4–90, 5–95, 6–116, 7–134. బౌలింగ్‌: ఆకాశ్‌ 3–0–17–1, తుషార్‌ దేశ్‌పాండే 3–0–26–0, తీక్షణ 4–0–27–1, మొయిన్‌ అలీ 2–0–18–0, జడేజా 4–0–22–3, పతిరణ 4–0–22–1.  
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (రనౌట్‌) 35; కాన్వే (నాటౌట్‌) 77; రహానే (సి) మార్క్‌రమ్‌ (బి) మార్కండే 9; రాయుడు (బి) మార్కండే 9; అలీ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1–87, 2–110, 3–122. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–0–10– 0, జాన్సెన్‌ 3–0–37–0, మార్క్‌రమ్‌ 1–0–11–0, సుందర్‌ 2.4–0–16–0, మార్కండే 4–0–23–2, ఉమ్రాన్‌ 3–0–18–0, డాగర్‌ 3–0–21–0.

ఐపీఎల్‌లో నేడు 
గుజరాత్‌ VS లక్నో  (మ. గం. 3:30 నుంచి) 
ముంబై VS పంజాబ్‌  (రాత్రి గం. 7:30 నుంచి) 

స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement