ధోని మంత్రం పని చేయలేదు

Chennai Super‌ Kings‌ damaged by collective failure - Sakshi

ఐపీఎల్‌లో చెన్నై పేలవ ప్రదర్శన

తొలిసారి ప్లే ఆఫ్స్‌కు దూరం!

సమష్టి వైఫల్యంతో దెబ్బతిన్న సూపర్‌ కింగ్స్‌  

ఒకప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు అతను దిగ్గజాల్లాంటి సీనియర్లతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు కుర్రాళ్లను ఎందుకు ఆడించడం లేదంటే వారిలో తనకు కావాల్సిన ‘మెరుపు’ కనిపించలేదని చెబుతున్నాడు. ఇన్నాళ్లూ ధోని ఏం వ్యూహం రచించినా అదో అద్భుతంగా అనిపించింది. ఎలాంటి ప్రణాళిక వేసినా ఆహా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అనామక బౌలర్‌ కూడా ధోని సారథ్యంలో ఆడితే అసాధారణంగా కనిపించేవాడు. కానీ ఈసారి ఐపీఎల్‌లో అలాంటి చమక్కులు ఏమీ కనిపించలేదు. ఒక సీజన్‌లో జట్టు విఫలం కావడంలో తప్పు లేదు కానీ చెన్నై జట్టు ఆట చూస్తే మరీ ఇలానా... అన్నట్లుగా అభిమానులు సైతం నిట్టూర్చే విధంగా సాగడమే విషాదం.  

సాక్షి క్రీడా విభాగం: తాజా సీజన్‌లో ధోనితోపాటు జట్టు సహచరులకు కూడా ఏదీ కలిసి రాలేదు. లీగ్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు పేరుకు ఈసారి మూడు మ్యాచ్‌లు గెలిచినా... ఒక్కసారి కూడా తమ స్థాయిని ప్రదర్శించే ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నిషేధం తర్వాత తీవ్ర ఒత్తిడిలో 2018లో బరిలోకి దిగి చాంపియన్‌గా నిలవడంతో పాటు గత ఏడాది ఫైనల్‌ కూడా చేరగలిగిన టీమ్‌ ఇంతగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు.  

వ్యూహాలే గందరగోళం... 
ఐపీఎల్‌లో ఏ జట్టు విజయంలోనైనా పవర్‌ప్లేలో చేసే పరుగులు అత్యంత కీలకం. కానీ ఈసారి పవర్‌ప్లేలో చెన్నై ఆట అన్ని మ్యాచ్‌లలో టెస్టులను తలపించింది. తొలి 6 ఓవర్లలో చెన్నైకంటే తక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. వికెట్లు కాపాడుకొని... చివర్లో చెలరేగిపోవచ్చనే వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. ఆఖర్లో వచ్చేసరికి ఒత్తిడి పెరిగిపోయి సాధారణ లక్ష్యాలను కూడా ఛేదించలేక సీఎస్‌కే చతికిలపడింది. ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లి కూడా అద్భుతంగా గెలిపించవచ్చని గతంలో ఎన్నోసార్లు నిరూపించిన ధోని బ్యాట్‌ ఈసారి మూగబోయింది. చేయాల్సిన పరుగుల రన్‌రేట్‌ విపరీతంగా పెరిగిపోయి చివరి మెట్టుపై బోల్తా పడాల్సిన పరిస్థితి వచి్చంది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో సూపర్‌ కింగ్స్‌ నుంచి ‘భారీ స్కోరు’ అనే మాట వినిపించడమే గగనంగా మారింది. ఆదివారం సూపర్‌ ఓవర్ల తర్వాత ఒక చెన్నై అభిమాని ‘మా జట్టుకు ఎప్పుడైనా సూపర్‌ ఓవర్‌ ఆడే అవకాశమే రాకపోతే మంచిది. ఎందుకంటే వాళ్లు నిలదొక్కుకునే లోపే ఓవర్‌ ముగిసిపోతుంది’ అంటూ చేసిన సరదా వ్యాఖ్య పరిస్థితిని చూపిస్తోంది. 

అందరూ అందరే... 
సీజన్‌లో చెన్నై 17 మంది ఆటగాళ్లను బరిలోకి దించింది. ఒకటి రెండు వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టుగా చూస్తే అందరి వైఫల్యం కనిపిస్తుంది. ‘సీనియర్‌ సిటిజన్స్‌ టీమ్‌’ అంటూ మొదటి నుంచీ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపించినా మేనేజ్‌మెంట్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే సమస్య వయసు గురించి కాదు. సత్తా ఉంటే ఏ వయసువారైనా చెలరేగిపోగలరు. కానీ చెన్నై జట్టు పరిస్థితి భిన్నం. ప్రధాన ఆటగాళ్లలో సగం మంది రిటైర్డ్‌ లేదా సెమీరిటైర్డ్‌లాంటివారు ఉన్నారు. లీగ్‌కు నెల రోజుల ముందు అంతా ఒక్క చోటికి చేరడం, కొంత సాధన చేయడం, ఐపీఎల్‌ ఆడేయడం... కానీ వేర్వేరు కారణాలతో ఈసారి అది పని చేయలేదు. ఆటగాళ్లకు ‘కంటిన్యుటీ’ సమస్య బాగా కనిపించింది. జట్టుకు దిక్సూచి లాంటి ధోనినే స్వయంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడేశాడు. అందుకే ఎంత ప్రయతి్నంచినా ఆ షాట్లలో పదును కనిపించలేదు, బ్యాటింగ్‌లో చురుకుదనం కనిపించలేదు. వాట్సన్, బ్రేవో ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నారు. ఇతర లీగ్‌లలో పాల్గొంటున్నా... ఐపీఎల్‌తో పోలిస్తే వాటి ప్రమాణాలు పేలవం. కేదార్‌ జాదవ్‌ సంగతి సరే సరి. మొత్తం జట్టులో అన్ని ఫార్మాట్‌లలో ఉన్న భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఒక్కడే. అందువల్లే కావచ్చు అతనొక్కడిలోనే కాస్త ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇదే తరహాలో డుప్లెసిస్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చగా, తనకున్న అనుభవాన్ని బట్టి చూస్తే స్యామ్‌ కరన్‌ ఆటను కాస్త మెచ్చుకోవచ్చు.  సర్వం తానే అయి వ్యవహరించే ధోని... రైనా, హర్భజన్‌లాంటి ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దూరమైతే, కనీసం వారి స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన కూడా చేయకపోవడం తనపై తనకు ఉన్న అతి నమ్మకమని చెప్పవచ్చు.   

మొత్తం మార్చేస్తారా... 
మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి రేసులో నిలిచేందుకు ప్రయతి్నస్తాం అనే మొహమాటపు మాటకు పోకుండా తమ పని ముగిసిపోయిందని ధోని స్పష్టంగానే చెప్పేశాడు. కాబట్టి ఇక దృష్టి వచ్చే సీజన్‌ మీదే. నిబంధనల ప్రకారం 2018 వేలంలో తీసుకున్న ఆటగాళ్ల ఒప్పందం 2020తో ముగుస్తుంది. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ వేలం జరిగాలి. అయితే ఏప్రిల్‌లో జరిగే ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ సారికి వేలం నిర్వహించరాదనే ఆలోచనతో బీసీసీఐ ఉన్నట్లు వినిపించింది. అయితే ఇంతటి ‘భారమైన’ జట్టుతో చెన్నై 2021 లీగ్‌ ఆడే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి ఆ జట్టు వేలం కోసం పట్టుబడవచ్చు. గత ఫలితాలు, చరిత్రను పక్కన పెడితే ఇప్పుడున్న టీమ్‌లో సమూల మార్పులు చేసి వస్తేనే చెన్నై మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఈసారి ధోని ఆట చూస్తే వచ్చేసారి ఆటగాడిగా కొనసాగుతాడా అనేది సందేహమే కానీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచనలను బట్టి అది ఉండవచ్చు. అయితే తాజా సీజన్‌ మాత్రం అభిమానులకు చేదు జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. 

ధోని పేద్ద పిస్తా అయితే కావచ్చు. అతను గొప్ప ఆటగాడు కూడా. కానీ కుర్రాళ్లలో తనకు కావాల్సిన మెరుపు కనిపించలేదని అతను చేసిన వ్యాఖ్యను నేను ఏమాత్రం సమరి్థంచను. అసలు అతని ఆలోచనే అర్థరహితం. ఫలితాలు కాదు ప్రక్రియ ముఖ్యం అనే ధోరణే అర్థం లేనిది. ఇచ్చిన ఒక అవకాశంలో రాణించిన జగదీశన్‌లో నీకు కనిపించని మెరుపు జాదవ్, చావ్లాలలో కనిపించిందా. అసలు జాదవ్‌ మైదానంలో దిగాలంటే ఒక స్కూటర్‌ కావాల్సిందేమో. 
–ధోనిపై మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ వ్యాఖ్య    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top