చర్చిల్‌ బ్రదర్స్‌కు కాదు...ఇంటర్‌ కాశీకి టైటిల్‌ ఇవ్వండి | Change in I League champion status | Sakshi
Sakshi News home page

చర్చిల్‌ బ్రదర్స్‌కు కాదు...ఇంటర్‌ కాశీకి టైటిల్‌ ఇవ్వండి

Jul 19 2025 4:23 AM | Updated on Jul 19 2025 4:23 AM

Change in I League champion status

ఐ–లీగ్‌ చాంపియన్‌ హోదాలో మార్పు

గతంలోనే చర్చిల్‌ బ్రదర్స్‌కు విన్నర్స్‌ ట్రోఫీ అందజేసిన అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య 

ఏఐఎఫ్‌ఎఫ్‌ నిర్ణయాన్ని తిరస్కరించిన ‘కాస్‌’ 

‘కాస్‌’లో నామ్‌ధారి ఎఫ్‌సీ కేసులో గెలిచిన ఇంటర్‌ కాశీ ఎఫ్‌సీ 

ఒకవైపు జాతీయ పురుషుల జట్టు ప్రదర్శనపై విమర్శలు... విదేశీ కోచ్‌ల ముందస్తు రాజీనామాలు... ఈ ఏడాది ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలు... సమాఖ్యలో అంతర్గత కుమ్ములాటలు... వెరసి అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)కు ఏదీ కలసి రావడం లేదు. ఐ–లీగ్‌ విజేత తాజా ఉదంతంతో మరోసారి ఏఐఎఫ్‌ఎఫ్‌ పరువు పోయింది. 

తమకు అన్యాయం జరిగిందని ఒక జట్టు వాపోతుండగా... అవేమీ పట్టించుకోకుండా గత ఏప్రిల్‌లో ఏఐఎఫ్‌ఎఫ్‌ హడావిడిగా బహుమతి ప్రదానోత్సవం ఏర్పాటు చేసి గోవాకు చెందిన చర్చిల్‌ బ్రదర్స్‌ క్లబ్‌ జట్టుకు జాతీయ ఐ–లీగ్‌ 2024–2025 విన్నర్స్‌ ట్రోఫీ అందజేసింది. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంటర్‌ కాశీ క్లబ్‌ గత నెలలో స్విట్జర్లాండ్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (కాస్‌)లో అప్పీలు చేసింది. నెలన్నర రోజుల తర్వాత ‘కాస్‌’ తుది తీర్పు వెలువరించింది. ఐ–లీగ్‌ విజేతగా ఇంటర్‌ కాశీ జట్టును ప్రకటించాలని స్పష్టం చేసింది.  

న్యూఢిల్లీ: దేశవాళీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ‘ఐ–లీగ్‌’లో ఇంటర్‌ కాశీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు చాంపియన్‌గా అవతరించింది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) నిర్ణయాన్ని స్విట్జర్లాండ్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ అర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌ (కాస్‌) తిరస్కరించడంతో ఐ–లీగ్‌ 2024–25 సీజన్‌లో ఇంటర్‌ కాశీ జట్టుకు టైటిల్‌ దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 6తో ఐ–లీగ్‌ మ్యాచ్‌లు ముగియగా... సీజన్‌లో 22 మ్యాచ్‌లాడిన చర్చిల్‌ బ్రదర్స్‌ 11 విజయాలు, 4 పరాజయాలు, 7 ‘డ్రా’లతో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానంలో నిలిచింది. 

మరోవైపు ఇంటర్‌ కాశీ జట్టు 22 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 5 పరాజాయలు, 6 ‘డ్రా’లతో 39 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. అయితే లీగ్‌ దశలో భాగంగా నామ్‌ధారి జట్టుతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఇంటర్‌ కాశీ జట్టు పరాజయం పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో నామ్‌ధారి జట్టు అర్హత లేని ఆటగాడిని ఆడించిందని ఇంటర్‌ కాశీ జట్టు ఆరోపించింది. దాన్ని ఏఐఎఫ్‌ఎఫ్‌ పట్టించుకోకపోవడంతో... వారణాసికి చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ స్విట్జర్లాండ్‌లోని ‘కాస్‌’లో ఫిర్యాదు చేసింది. దీంతో జోక్యం చేసుకున్న ‘కాస్‌’... ఏఐఎఫ్‌ఎఫ్‌ నిర్ణయాన్ని తప్పుపడుతూ... ఇంటర్‌ కాశీ జట్టుకు మూడు పాయింట్లు కేటాయించాల్సిందిగా ఆదేశించింది. 

దీంతో ఇంటర్‌ కాశీ జట్టు 42 పాయింట్లతో పట్టిక అగ్రస్థానం దక్కించుకొని 2024–25 సీజన్‌ చాంపియన్‌గా అవతరించింది. ‘అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య ఈ ఏడాది మే 31న జారీ చేసిన నిర్ణయంపై ఇంటర్‌ కాశీ దాఖలు చేసిన అప్పీలును పరిశీలించాం. భారత సమాఖ్య ఇంటర్‌ కాశీ జట్టును ఐ–లీగ్‌ సీజన్‌ చాంపియన్‌గా ప్రకటించాలని ఆదేశిస్తున్నాం’ అని ‘కాస్‌’ ప్రకటించింది.  

» 2023–24 సీజన్‌లో ఐ–లీగ్‌లో అడుగు పెట్టిన ఇంటర్‌ కాశీ జట్టు తొలి ప్రయత్నంలో నాలుగో స్థానంలో నిలవగా... ఇప్పుడు రెండో ఏడాది టైటిల్‌ కైవసం చేసుకోనుంది.  
»  దేశంలో ఐ–లీగ్‌ ద్వితీయ శ్రేణి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ కాగా... ప్రతి ఏటా ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన జట్టు అగ్రశ్రేణి ఫుట్‌బాల్‌ లీగ్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)కు అర్హత సాధిస్తుంది.  
» 2025–26 ఐఎస్‌ఎల్‌ సీజన్‌లో ఐ లీగ్‌ చాంపియన్‌ హోదాలో ఇంటర్‌ కాశీ జట్టు బరిలోకి దిగనుంది. అయితే మాస్టర్‌ రైట్స్‌ అగ్రిమెంట్‌ (ఎమ్‌ఆర్‌ఏ) గడువు ముగిసిన నేపథ్యంలో ఐఎస్‌ఎల్‌ తాజా సీజన్‌ ప్రారంభంపై స్పష్టత లోపించింది. 
»  2022–23, 2023–24 సీజన్‌లో ఐ–లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన పంజాబ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్, మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ జట్లు... ఐఎస్‌ఎల్‌లో బరిలోకి దిగాయి.  
» తాజా తీర్పుతో ఐ–లీగ్‌ పాయింట్ల పట్టికను మార్చాల్సిందిగా ఏఐఎఫ్‌ఎఫ్‌ను ‘కాస్‌’ఆదేశించింది. ఇంటర్‌ కాశీ జట్టుకు 42 పాయింట్లు కేటాయించి పట్టికలో అగ్రస్థానం ఇవ్వాలని వెల్లడించింది. 
» ఆర్బిట్రేషన్‌ ఖర్చుల్లో 55 శాతం భరించాల్సిందిగా ఏఐఎఫ్‌ఎఫ్‌ను ఆదేశించిన కాస్‌... చర్చిల్‌ బ్రదర్స్, నామ్‌ధారి ఎఫ్‌సీ, రియల్‌ కశీ్మర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లు 15 శాతం చొప్పున ఖర్చులు భరించాలని ఆదేశించింది. దీంతో ఏఐఎఫ్‌ఎఫ్‌ 3000 స్విస్‌ ఫ్రాంక్స్‌ (దాదాపు రూ. 3,22,275)లు, మిగిలిన మూడు క్లబ్‌లు 1000 స్విస్‌ ఫ్రాంక్‌ (దాదాపు రూ. 1,07,413)లు ఇంటర్‌ కాశీ జట్టుకు చెల్లించాల్సి ఉంటుంది.  
» ఈ ఏడాది జనవరి 13న ఇంటర్‌ కాశీ, నామ్‌ధారి జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో నామ్‌ధారి జట్టు 2–0 గోల్స్‌ తేడాతో నెగ్గింది. అయితే ఆ మ్యాచ్‌లో నామ్‌ధారి క్లబ్‌ అర్హత లేని ఆటగాడిని బరిలోకి దింపిందని ఇంటర్‌ కాశీ ఆరోపించింది.  
» ఐ–లీగ్‌లో ఆరుగురు విదేశీ ప్లేయర్లను మాత్రమే ఆడించే నిబంధన ఉండగా... నామ్‌ధారి జట్టు ఏడుగురు ఆటగాళ్లతో ఆడిందని నిరూపించడంలో ఇంటర్‌ కాశీ జట్టు విజయవంతమైంది. దీంతో గత నెల 17న జరిగిన తొలి అప్పీలుతో పాటు... శుక్రవారం జరిగిన మరో విచారణలో సైతం ఇంటర్‌ కాశీ జట్టు విజయం సాధించింది. ఫలితంగా ఈ సీజన్‌ చాంపియన్‌గా అవతరించింది.  
» ఇంటర్‌ కాశీ జట్టు ఈ అంశాన్ని ‘కాస్‌’ దృష్టికి తీసుకెళ్లినా... భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య మాత్రం అవేవి పట్టించుకోకుండా సీజన్‌ ముగియగానే పాయింట్ల పట్టిక ‘టాప్‌’లో ఉన్న చర్చిల్‌ బ్రదర్స్‌ జట్టుకు ట్రోఫీ బహుకరించింది. అయితే తాజా ‘కాస్‌’ నిర్ణయంతో చర్చిల్‌ బ్రదర్స్‌ నుంచి ట్రోఫీ వెనక్కి తీసుకొని ఇంటర్‌ కాశీకి అందివ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement