పోరాడి ఓడిన బోపన్న జోడీ | Bopanna Jodi fought and lost | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన బోపన్న జోడీ

Oct 9 2024 4:05 AM | Updated on Oct 9 2024 4:05 AM

Bopanna Jodi fought and lost

షాంఘై: భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు మరో టోర్నీలో నిరాశ ఎదురైంది. షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ ఏటీపీ–1000 టోర్నీ నుంచి రోహన్‌ బోపన్న (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) ద్వయం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ బోపన్న–డోడిగ్‌ జోడీ 6–7 (5/7), 6–2, 12–14తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నికోలా మెక్‌టిక్‌ (క్రొయేషియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. 

గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–డోడిగ్‌ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన బోపన్న–డోడిగ్‌లకు 34,100 డాలర్ల (రూ. 28 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 
ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో రౌండ్‌లో జొకోవిచ్‌ 6–1, 6–2తో ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై గెలుపొందాడు. టాప్‌ సీడ్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ), మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.   

Advertisement
 
Advertisement
Advertisement