బెన్‌ స్టోక్స్‌ ఇంట తీవ్ర విషాదం

Ben Stokes Father Gerard Stokes Passed Away With Brain Cancer - Sakshi

వెల్లింగ్టన్ ‌: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. స్టోక్స్‌ తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్(65) బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మరణ వార్తను క్లబ్ వర్కింగ్ టౌన్ ధృవీకరిచింది. కాగా మాజీ రగ్బీ ప్లేయర్‌ అయిన జేమ్స్‌ స్టోక్స్‌ వర్గింగ్‌ టౌన్‌ రగ్బీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా వర్కింగ్‌ టౌన్‌ రగ్బీ క్లబ్‌ స్పందిస్తూ.. ' కోచ్ గెరార్డ్ స్టోక్స్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఆయన కుటుంబానికి ఇవే మా ప్రగాడ సానభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి 'అని ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి : టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు)

ప్రస్తుతం స్టోక్స్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ వైట్‌వాష్‌ చేసింది. వన్డే సిరీస్‌కు ముందు హోటల్‌ సిబ్బందిలో కరోనా కేసులు వెలుగు చూడడంతో సిరీస్‌ను రద్దు వేసినట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. కాగా విషయం తెలుసుకున్న వెంటనే స్టోక్స్‌ న్యూజిలాండ్‌కు బయల్దేరగా.. ఇంగ్లండ్‌ జట్టు మాత్రం గురువారం ఇంగ్లండ్‌ వెళ్లనుంది. (చదవండి : మా ఆటగాళ్లకు  వైరస్‌ లేదు: ఈసీబీ)

కాగా బెన్‌ స్టోక్స్‌ 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు గెరార్డ్‌ జేమ్స్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌కు వలస వచ్చారు. అక్కడే వర్కింగ్‌ టౌన్‌ రగ్బీ కోచ్‌గా పనిచేశారు.  అయితే జేమ్స్‌ స్టోక్స్‌ అనారోగ్యం గురవడంతో 2013లో న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లిపోయారు. కానీ అప్పటికే స్టోక్స్ ఇంగ్లండ్‌కు ఆడుతుండడంతో అక్కడే ఉండిపోయాడు. ఇటీవలే తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నుంచి అర్థంతరంగా తప్పుకున్న స్టోక్స్‌ తండ్రికి అండగా ఉండేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. ఆ తర్వాత యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఐపీఎల్‌ ఆడడానికి వచ్చినట్టు స్టోక్స్ అప్పట్లో చెప్పుకొచ్చాడు.(చదవండి : అయ్యో! చహల్‌ ఎంత పని జరిగింది)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top