సబలెంకా బోణీ | Sakshi
Sakshi News home page

సబలెంకా బోణీ

Published Wed, May 29 2024 4:14 AM

Belarus star into the second round

రెండో రౌండ్‌లోకి బెలారస్‌ స్టార్‌

తొలి రౌండ్‌లో ఓడిన ఆరో సీడ్‌ సాకరి  

పారిస్‌: ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6–1, 6–2తో ఇరీకా ఆంద్రీవా (రష్యా)పై అలవోకగా విజయం సాధించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది.

27 విన్నర్స్‌ కొట్టిన సబలెంకా నెట్‌ వద్ద 11 పాయింట్లు సాధించింది. ఏడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడుతున్న ఈ బెలారస్‌ స్టార్‌ గత ఏడాది తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌) వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో తొలి రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయింది. సాకరి 6–3, 4–6, 3–6తో వర్వరా గ్రెచెవా (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయింది. 

2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకరి ఆరు డబుల్‌ ఫాల్ట్‌లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. నాలుగో సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌), ఏడో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా), పదో సీడ్‌ దరియా కసత్‌కినా (రష్యా) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రిబాకినా 6–2, 6–3తో గ్రీట్‌ మినెన్‌ (బెల్జియం)పై, కిన్‌వెన్‌ జెంగ్‌ 6–2, 6–1తో అలీజా కార్నె (ఫ్రాన్స్‌)పై, కసత్‌కినా 7–5, 6–1తో మగ్ధలీనా ఫ్రెచ్‌ (పోలాండ్‌)పై గెలుపొందారు.  

రూడ్‌ శుభారంభం 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2022, 2023 రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో రూడ్‌ 6–3, 6–4, 6–3తో అల్వెస్‌ మెలెగిని (బ్రెజిల్‌)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రూడ్‌ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 

23 విన్నర్స్‌ కొట్టిన రూడ్‌ నెట్‌ వద్ద 10 పాయింట్లు సాధించాడు. వర్షం అంతరాయం కారణంగా మంగళవారం జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లను వాయిదా వేశారు. ఇందులో భారత డబుల్స్‌ ప్లేయర్లు రోహన్‌ బోపన్న, యూకీ బాంబ్రీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి.   

కార్నె వీడ్కోలు... 
ఈ టోర్నీతో ఫ్రాన్స్‌ టెన్నిస్‌ స్టార్‌ అలీజా కార్నె కెరీర్‌కు వీడ్కోలు పలికింది. కిన్‌వెన్‌ జెంగ్‌ చేతిలో మ్యాచ్‌ ముగిశాక ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులు కార్నెను సన్మానించి చేసి వీడ్కోలు ట్రోఫీని అందజేశారు. 34 ఏళ్ల కార్నె అత్యధిక వరుస గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. 

కార్నె 2007 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ నుంచి తాజా ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరకు వరుసగా 69 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడింది. 2014 వింబుల్డన్‌ టోర్నీ మూడో రౌండ్‌లో నాటి ప్రపంచ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ను ఓడించిన కార్నె 2022 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 

2009లో కెరీర్‌ బెస్ట్‌ 11వ ర్యాంక్‌ను అందుకున్న కార్నె తాజా ర్యాంకింగ్స్‌లో 106వ స్థానంలో ఉంది. ర్యాంకింగ్‌పరంగా కార్నెకు నేరుగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో నిర్వాహకులు వైల్డ్‌ కార్డు కేటాయించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement