పాజిటివ్‌ వచ్చిందో... చోటు పోయినట్లే

BCCI Warns Players, Consider Your Tour Over If You Test Covid-19 Positive - Sakshi

భారత క్రికెటర్లకు బీసీసీఐ హెచ్చరిక

ముంబై: ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైన భారత క్రికెటర్లంతా స్వస్థలాల్లోనూ తగు జాగ్రత్తలతో కరోనా నుంచి తమను తాము కాపాడుకోవాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టంగా చెప్పింది. టీమ్‌ అంతా ఒక్క చోటికి చేరే సమయంలో ఎవరైనా పాజిటివ్‌ వస్తే వారు ఇంగ్లండ్‌ పర్యటన నుంచి దూరమైనట్లేనని హెచ్చరించింది. టీమిండియా ఫిజియో యోగేశ్‌ పర్మార్‌ సూచనలతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం జూన్‌ 2న భారత జట్టు ఇంగ్లండ్‌ బయలుదేరాల్సి ఉండగా కనీసం పది రోజుల పాటు భారత్‌లో ప్రత్యేక బబుల్‌ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. వేర్వేరు నగరాల నుంచి ముంబైకి వచ్చే క్రికెటర్లు హోటల్‌లోకి అడుగు పెట్టగానే ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఐపీఎల్‌ వాయిదా వేయాల్సి రావడంతో బోర్డు ఈసారి అదనపు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ‘ముంబైకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆటగాడు కరోనా పాజిటివ్‌గా తేలితే వారి ఇంగ్లండ్‌ పర్యటన ఇక్కడే ముగిసిపోయినట్లుగా భావించవచ్చు. క్రికెటర్లు అందరికీ ఈ విషయం చెప్పేశాం. ఎవరి కోసం కూడా బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ముంబైకి రాక ముందే వీలైనంత వరకు వారు ఐసోలేషన్‌లోనే ఉంటే మరీ మంచిది’ అని బోర్డు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.  

కోవిషీల్డ్‌ డోసు తీసుకోండి... 
మరోవైపు క్రికెటర్లంతా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మాత్రమే మొదటి డోసు వేసుకోవాలని కూడా సూచించింది. కోవిషీల్డ్‌ మరో వెర్షన్‌ అయిన అస్ట్రాజెన్‌కా ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి రెండో డోసు అక్కడ తీసుకోవచ్చని... అదే కోవాగ్జిన్‌ అయితే సాధ్యం కాదని చెప్పింది. ఎవరైనా క్రికెటర్లు తమ నగరంలో  కోవిషీల్డ్‌ అందుబాటులో లేదని చెబితే తాము ఏర్పాటు చేస్తామని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది.

బుమ్రా, స్మృతిలకు ‘వ్యాక్సిన్‌’
వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సారథి విరాట్‌ కోహ్లిŠ, రహానే, పుజారా, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లతో సహా పలువురు క్రికెటర్లు తమ తొలి డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను వేయించుకోగా... తాజాగా ఆ జాబితాలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా చేరాడు. తాను తొలి డోస్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు బుమ్రా ట్విట్టర్‌ ద్వారా మంగళవారం తెలిపాడు. ‘వ్యాక్సిన్‌ తీసుకోవడం పూర్తయింది. మీరూ క్షేమం గా ఉండండి’ అంటూ బుమ్రా ట్వీట్‌ చేశాడు. దినేశ్‌ కార్తీక్, భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానలు కూడా తొలి డోస్‌ వ్యాక్సిన్‌ను వేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top