BCCI: అనుకున్నాం... కానీ ఇవ్వలేకపోయాం

BCCI Promised Compensation To First-Class Players Still Pending After One Year - Sakshi

రాష్ట్ర సంఘాలు జాబితాలు పంపలేదు

ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల పరిహారంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ వివరణ

న్యూఢిల్లీ: గతేడాది కరోనా కారణంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు ప్రతిష్టాత్మకమైన రంజీ టోర్నీ రద్దయింది. మ్యాచ్‌ ఫీజులు, కాంట్రాక్టుల రూపంలో దేశవాళీ ఆటగాళ్లకు చెప్పలేనంత ఆర్థిక నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్ద మనసు చేసుకుంది. ఆయా టోర్నీలను కోల్పోయిన పురుషులు, మహిళా క్రికెటర్లకు పరిహారం అందజేయాలని గతేడాదే నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే బోర్డు కృషి మాత్రం ప్రణాళికాబద్ధంగా సాగలేదు. ఆచరణలో విఫలమైంది.

ఏడాది పూర్తయినా కానీ ఇంకా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు, అమ్మాయిలకు ఎలాంటి పరిహారభత్యం అందలేదు. మహిళల టి20 ప్రపంచకప్‌ రన్నరప్‌ భారత్‌కు ప్రైజ్‌మనీ ఇవ్వలేదన్న అంశం తెరమీదకు రావడంతో ఇప్పుడు ఫస్ట్‌క్లాస్‌ ఆటగాళ్ల చెల్లింపుల విషయం కూడా బయటికొచ్చింది.

దీనిపై బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు ఆటగాళ్ల జాబితాలను ఇప్పటివరకు బీసీసీఐకి పంపలేదని, వారి తాత్సారం వల్లే ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు పరిహారం అందజేయలేకపోయామని చెప్పారు. ‘ఎవరు ఆడేవాళ్లు. ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు. ఎవరు రిజర్వ్‌ ఆటగాళ్లు అన్న వివరాలేవీ రాష్ట్ర సంఘాలు పంపలేదు. అందుకే చెల్లించలేకపోయాం’ అని అరుణ్‌ అన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top