టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..? | Sakshi
Sakshi News home page

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?

Published Tue, May 28 2024 7:05 PM

BCCI, Gautam Gambhir Discuss India Coach Role

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్‌ హెడ్‌ కోచ్‌ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్‌ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. గంభీర్‌ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ అయిన షారుఖ్‌ ఖాన్‌కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్‌సైట్‌ వెల్లడించింది. 

హెడ్‌ కోచ్‌ పదవికి గంభీర్‌ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్‌మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్‌ల మధ్య డీల్‌ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్‌ చెప్పినట్లు సమాచారం. 

రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా ఈ డీల్‌ క్లోజ్‌ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిశాక గంభీర్‌-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్‌ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. 

టీ20 వరల్డ్‌కప్‌ 2024తో భారత హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్‌ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందు​కు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. 

కాగా, గంభీర్‌ మెంటార్షిప్‌లో కేకేఆర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్‌ కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్‌ ఓసారి కేకేఆర్‌కు టైటిల్‌ అందించాడు. ఘనమైన ట్రాక్‌ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్‌కు ఉన్న కమిట్‌మెంట్‌ భారత్‌ హెడ్‌ కోచ్‌ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది.

 

Advertisement
 
Advertisement
 
Advertisement