IPL 2022: 2 కొత్త జట్లు.. భారీ వేలం..మార్గదర్శకాలను సిద్ధం చేసిన బీసీసీఐ

BCCI Finalizes Plan For New Franchises, Player Retention, And Mega Auction Ahead Of IPL 2022 - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజన్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆగస్టు 2021 నుంచి జనవరి 2022 మధ్యలో రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, భారీ వేలం, జట్ల సాలరీ పర్స్ ఇంక్రిమెంట్‌, మీడియా హక్కులు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో(డిసెంబర్) భారీ వేలాన్ని నిర్వహిస్తామని, అలాగే మరుసటి ఏడాది జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలుస్తామని బీసీసీఐ ప్రకటించింది.

కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు కోసం సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ (కోల్‌కతా), అదానీ గ్రూప్‌ (అహ్మదాబాద్‌), అరబిందో ఫార్మా (హైదరాబాద్‌), టొరెంట్‌ గ్రూప్‌ (గుజరాత్‌) సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అంశంపై కూడా బీసీసీఐ స్పష్టతనిచ్చింది. వేలానికి ముందు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రీటెయిన్‌ చేసుకోవచ్చని, ఇందులో ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. 

అలాగే ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు పెంచాలని నిర‍్ణయించింది. మరోవైపు పది జట్లతో నిర్వహించే ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని బీసీసీఐ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఎనిమిది జట్లతో 60 మ్యాచులు నిర్వహిస్తుండగా, పది జట్లతో అయితే 90కి పైగా మ్యాచులు పైగా నిర్వహించే అవకాశం ఉంది. దాంతో 25% ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top