Womens IPL: ఐదు జట్లు, రెండు వేదికలు.. 20 మ్యాచ్‌లు

BCCI considers 5 Teams-2 Venues-20 League Matches Inaugural Womens IPL - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఎంత పాపులారిటీ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాది మార్చి చివరి నుంచి జూన్‌ మొదటివారం వరకు బీసీసీఐ నిర్వహించే పురుషుల ఐపీఎల్‌కు సూపర్‌ క్రేజ్‌ ఉంటుంది. ఇప్పటికే 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్‌ ఇకపై మహిళల విభాగంలోనూ అలరించనుంది.

ఈ ఏడాది మహిళల ఐపీఎల్‌ నిర్వహించినప్పటికీ కేవలం ఐదు రోజుల్లోనే టోర్నీ ముగిసింది. కానీ వచ్చే ఏడాది మెన్స్‌ ఐపీఎల్‌ లాగానే మహిళల ఐపీఎల్‌ను కూడా నిర్వహించనున్నారు. వచ్చే సంవత్సరం జరగనున్న మహిళల ఐపీఎల్‌లో  ఎన్ని టీమ్స్‌ ఉంటాయి, ఎన్ని మ్యాచ్‌లు, ఎక్కడెక్కడ నిర్వహిస్తారు? టీమ్‌లో విదేశీ ప్లేయర్స్‌ సంఖ్య లాంటి అంశాలపై  బీసీసీఐ దృష్టి సారించింది.

తొలిసారి నిర్వహించబోతున్న ఈ లీగ్‌ను మొదట ఐదు టీమ్స్‌తో ప్రారంభించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కో టీమ్‌లో తుది జట్టులో ఐదుగురు విదేశీ ప్లేయర్స్‌ను అనుమతించాలన్న ఆలోచనలో బోర్డు ఉంది. పురుషుల ఐపీఎల్‌లో నలుగురు ప్లేయర్స్‌కే అనుమతి ఉన్న విషయం తెలిసిందే. వుమెన్స్‌ ఐపీఎల్‌లో నలుగురు ప్లేయర్స్‌ ఐసీసీలో ఫుల్‌టైమ్‌ మెంబర్‌ టీమ్స్‌ నుంచి.. ఒకరు అసోసియేట్‌ టీమ్‌ నుంచి ఉండేలా రూల్‌ తీసుకురానుంది.

ఇక ఈ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే అవకాశం ఉంది. కాగా వచ్చే ఏడాది ఆరంభంలోనే మహిళల టి20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీ తర్వాత వుమెన్స్‌ ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక టీమ్స్‌ ఎలా ఉండాలన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మెన్స్‌ ఐపీఎల్‌లో ఉన్నట్లుగా నగరాలకు అంటే అహ్మదాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కోల్‌కతాలకు ఇవ్వాలా లేక జోన్‌ వారీగా అంటే నార్త్‌ (ధర్మశాల/జమ్ము), సౌత్ (కొచ్చి/వైజాగ్‌), సెంట్రల్‌ (ఇండోర్‌/నాగ్‌పూర్‌/రాయ్‌పూర్‌), ఈస్ట్‌ (రాంచీ/కటక్‌), నార్త్‌ఈస్ట్‌ (గువాహటి), వెస్ట్‌ (పుణె/రాజ్‌కోట్‌)లకు ఇవ్వాలన్నదానిపై చర్చించనున్నారు.

మొదటి పద్ధతిలో మ్యాచ్‌లు ఐపీఎల్‌ వేదికల్లోనే జరుగుతాయి. ఒకవేళ జోన్‌ వారీగా టీమ్స్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఐపీఎల్‌ వేదికలు కాని వాటిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. దీనిపై తుది నిర్ణయం ఐపీఎల్‌ ఛైర్‌పర్సన్‌, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు తీసుకుంటారు. ఇక లీగ్‌ స్టేజ్‌లో ఒక్కో టీమ్‌ మరో టీమ్‌తో రెండేసిసార్లు ఆడతాయి. టేబుల్‌ టాపర్ నేరుగా ఫైనల్‌ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్‌ ఎలిమినేటర్‌లో తలపడతాయి.

ఈ వుమెన్స్‌ ఐపీఎల్‌ను రెండు వేదికల్లోనే జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 2023 ఐపీఎల్‌ రెండు వేదికల్లో, 2024 ఐపీఎల్‌ మరో రెండు వేదికల్లో, ఇక 2025 ఐపీఎల్‌ మిగిలిపోయిన ఒక్క వేదిక, 2023లో ఆడిన మరో వేదికలో ఆడే అవకాశం ఉంది.

చదవండి: థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్‌ ఫైనల్లో టీమిండియా వుమెన్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top