క‌నిపించ‌ని సూర్య‌కుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌! | BCCI Announced T-20 Team No-Place For Suryakumar-His-Career Over | Sakshi
Sakshi News home page

క‌నిపించ‌ని సూర్య‌కుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌!

Jun 6 2026 1:55 PM | Updated on Jun 6 2026 3:01 PM

BCCI Announced T-20 Team No-Place For Suryakumar-His-Career Over

టీమిండియా టీ20 స్పెష‌లిస్ట్‌గా ముద్ర‌ప‌డిన సూర్య‌కుమార్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది. తాజాగా శ‌నివారం ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్‌, ఆసియా గేమ్స్‌కు ప్ర‌క‌టించిన టీమిండియా జ‌ట్టులో సూర్య‌కుమార్‌కు చోటు ద‌క్క‌లేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కనీసం సూర్య పేరును ప్రస్తావించలేదని స్పష్టంగా తెలుస్తోంది. 

సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ కెరీర్ ఇలా అర్థంతరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియాకు ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకు వీడ్కోలు పలుకుతూ బీసీసీఐ చివరి మ్యాచ్ ఏమైనా ఆడిస్తుందేమో అని అభిమానులు ఆశించారు. 

కానీ  బీసీసీఐ తన పంథా మార్చి ఫామ్‌లో లేని ఆటగాళ్లను నిరభ్యరంతంగా జట్టు నుంచి పక్కనబెట్టేస్తుంది. కొన్ని రోజులుగా కెప్టెన్సీ పదవి నుంచి మాత్రమే సూర్యను తప్పిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఇవాళ ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ పేరు కనిపించకపోవడంతో అతడి కెరీర్‌కు ముగింపు పడినట్లయింది.

తుఫానులా దూసుకొచ్చిన సూర్య
31 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ అనతికాలంలోనే టీ20 క్రికెట్‌లో స్టార్ హోదాను పొందాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరు పొందిన సూర్య మైదానం నలువైపులా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 

దీంతో సూర్యకుమార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అసమాన ప్రదర్శన కనబరిచిన సూర్య ఆట 2025 నుంచి పతనం దిశగా సాగింది. కెప్టెన్సీ ఒత్తిడిలో తన సహజసిద్ధమైన ఆటకు దూరంగా జరిగిన సూర్యకుమార్ ఫామ్‌లేమితో తంటాలు పడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్య పెద్దగా రాణించింది లేదు. అయితే టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్‌కు సూర్య కెప్టెన్ హోదాలో ఉండడమే అతడికి దక్కిన ఘనత అని చెప్పొచ్చు. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేయడంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సీనియర్ అయినా, అనుభవం ఉన్నా సరే ఫామ్‌లో ఉన్న ఆటగాడిగే తన మద్దతు ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్ కుండబద్ధలు కొట్టడంతో సూర్యకుమార్ కెప్టెన్సీతో పాటు జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకంగా మారిపోయింది. 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ చోటు కోల్పోయాడు. సూర్యకుమార్ టీమిండియా తరఫున 113 టీ20లు ఆడి 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 25 అర్థసెంచరీలున్నాయి. దీంతో పాటు సూర్యకుమార్ 37 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 

మొత్తంమీద టీమిండియాలోకి తుఫానులా దూసుకొచ్చిన సూర్యకుమార్ ఐదేళ్లు తిరక్కుండానే అశనిపాతంలా కిందకు పడిపోవడం గమనార్హం. చివరగా ఎన్నేళ్లు ఆడామాన్నది కాదు.. ఆడిన కొద్దికాలంలోనే తన పేరును చరితార్థం చేసుకున్న సూర్యకుమార్‌కు హ్యాట్సాఫ్‌. గుడ్‌బై మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్‌.

చదవండి: BCCI: వైభవ్‌ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!

Advertisement
 
Advertisement
Advertisement