మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం.. అధికారిక ప్రకటన | Babar Azam Named Pakistan Test Captain For West Indies And England Tours After Shan Masood Sacked Following Disappointing Results | Sakshi
Sakshi News home page

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం.. అధికారిక ప్రకటన

Jul 5 2026 1:51 PM | Updated on Jul 5 2026 3:23 PM

Babar Azam named Pakistan Test captain for West Indies, England tours

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంను మరోసారి టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటివరకు టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన షాన్ మసూద్‌ను పదవి నుంచి తప్పిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దాదాపు మూడు సంవత్సరాల క్రితం టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షాన్ మసూద్ ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు. అతని నాయకత్వంలో పాకిస్తాన్ ఘోర వైఫల్యాలను ఎదుర్కొంది. 16 టెస్టు మ్యాచ్‌లు ఆడగా కేవలం నాలుగింట మాత్రమే విజయాలు సాధించింది. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలోనే టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్‌గా కోల్పోవడం మసూద్ కెప్టెన్సీకి ఎసరుపెట్టింది. గత రెండేళ్లలో అతడి నాయకత్యంలో పాక్‌ బంగ్లాదేశ్ చేతిలో రెండోసారి వైట్‌వాష్‌ను ఎదుర్కోవడంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనల్లో కూడా వరుసగా సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌గా కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో మళ్లీ బాబర్ ఆజంపై పాక్‌ క్రికెట్ బోర్డు విశ్వాసం ఉంచింది. మసూద్‌కు ముందు కూడా బాబర్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఇటీవల టెస్ట్‌ల్లో బాబర్‌ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కెప్టెన్‌గా నియమించడం​ గమనార్హం.

కాగా, పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ పర్యటనల కోసం తమ టెస్ట్‌ జట్టును ప్రకటించింది. విండీస్‌ పర్యటనకు 16 మంది, ఇంగ్లండ్ పర్యటనకు 17 మంది (ఫిట్‌నెస్‌ను బట్టి సౌద్ షకీల్ జట్టులో అవకాశం) సభ్యులను పాక్‌ సెలెక్టర్లు ఎంపిక చేశారు.

ఈ రెండు పర్యటనల కోసం ప్రకటించిన జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఎడమచేతి స్పిన్నర్ అలీ ఉస్మాన్, బ్యాటర్ మహ్మద్ అవైస్ జఫర్, ఫాస్ట్ బౌలర్ ఉబైద్ షా, వికెట్‌కీపర్-బ్యాటర్ మహ్మద్ ఘాజీ ఘోరీ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.

పాకిస్తాన్ జట్టు ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టరౌబాలో జరగనుండగా, రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి 6 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో నిర్వహించనున్నారు.

వెస్టిండీస్ పర్యటన అనంతరం పాకిస్తాన్ నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. అక్కడ మూడు టెస్టుల సిరీస్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగుతుంది. తొలి టెస్టు లీడ్స్‌లో, రెండో టెస్టు లార్డ్స్‌లో, మూడో టెస్టు బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.

వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం పాకిస్తాన్ టెస్టు జట్టు..
బాబర్ ఆజం (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవైస్, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రం షహ్‌జాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), మహ్మద్ అవైస్ జఫర్, మహ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్‌కీపర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, షాన్ మసూద్, ఉబైద్ షా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement