బాబర్‌ ఆజం పోరాటం​ వృధా.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన పాక్‌ | Babar Azam fight goes in vain, Pakistan All out for 232 runs in first innings | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజం పోరాటం​ వృధా.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన పాక్‌

May 17 2026 3:57 PM | Updated on May 17 2026 6:41 PM

Babar Azam fight goes in vain, Pakistan All out for 232 runs in first innings

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్‌ వెనుకపడింది. సిల్హెట్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌట్‌ కాగా.. పాక్‌ మరింత తీసికట్టుగా 232 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బంగ్లాకు 46 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 8 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. తంజిద్‌ హసన్‌ (4) ఔట్‌ కాగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (26), మొమినుల్‌ హక్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని బంగ్లాదేశ్‌ 89 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ప్రస్తుతం రెండో రోజు ఆట మూడో సెషన్‌ కొనసాగుతుంది.

బాబర్‌ పోరాటం వృధా
బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసిన ఆనందం పాక్‌కు ఎంతో సేపు నిలబడలేదు. ఆ జట్టు బంగ్లా కంటే తక్కువ స్కోర్‌కే ఆలౌటై ఉసూరుమనిపించింది. బాబర్‌ ఆజం అద్భుతైన అర్ద సెంచరీతో (68) పోరాడినా పాక్‌ను గట్టెక్కించలేకపోయాడు. ఆఖర్లో సాజిద్‌ ఖాన్‌ (38) బ్యాట్‌ ఝులిపించడంతో పాక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

పాక్‌ ఇన్నింగ్స్‌లో అజాన్‌ అవైస్‌ 13, అబ్దుల్లా ఫజల్‌ 9, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 21, సౌద్‌ షకీల్‌ 8, సల్మాన్‌ అఘా 21, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 13, హసన్‌ అలీ 18, ఖుర్రమ్‌ షెహజాద్‌ 10 పరుగులకు ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్‌ రాణా, తైజుల్‌ ఇస్లాం తలో 3 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ మిరాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

దాస్‌ శతకం
తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ లిట్టన్‌ దాస్‌ (126) వీరోచిత శకతం సాధించడంతో గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. పాక్‌ బౌలర్లు అబ్బాస్‌ (3 వికెట్లు), ఖుర్రమ్‌ షెహజాద్‌ (4), హసన్‌ అలీ (2), సాజిద్‌ ఖాన్‌ (1) సత్తా చాటారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌ ఈపాటి స్కోర్‌ చేయడం కూడా చాలా గొప్పే. దాస్‌కు మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.

తంజిద్‌ హసన్‌ (26), మొమినుల్‌ హక్‌ (22), కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (23), తైజుల్‌ ఇస్లాం (16), ఫోరిఫుల్‌ ఇస్లాం (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్‌ హసన్‌ మిరాజ్‌ 4, తస్కిన్‌ అహ్మద్‌ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నహిద్‌ రాణా డకౌట్లయ్యారు.

కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ ఊహించని విధంగా 104 పరుగుల తేడాతో పాక్‌కు షాకిచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement