Australian Open 2023: ఎదురులేని జొకోవిచ్‌

Australian Open 2023: Serbia star Novak Djokovic enters Prequarter Final - Sakshi

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సెర్బియా స్టార్‌

పోరాడి ఓడిన ముర్రే  

మెల్‌బోర్న్‌: పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ 7–6 (9/7), 6–3, 6–4తో 27వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 11 ఏస్‌లు సంధించాడు. 28 విన్నర్స్‌ కొట్టిన అతడు 22 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఐదుసార్లు దిమిత్రోవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు.

మరోవైపు ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే కథ ముగిసింది. తొలి రెండు రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదు సెట్‌లపాటు పోరాడి గెలిచిన ముర్రే మూడో రౌండ్‌లో మాత్రం పుంజుకోలేకపోయాడు. బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌) 6–1, 6–7 (7/9), 6–3, 6–4తో ముర్రేను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా), తొమ్మిదో సీడ్‌ హోల్గర్‌ రూన్‌ (డెన్మార్క్‌) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. 2004 తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అత్యధికంగా నలుగురు అమెరికా ఆటగాళ్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు.  

సబలెంకా, గార్సియా ముందంజ
మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ సబలెంకా
(బెలారస్‌), నాలుగో సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌), 12వ సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్‌ మ్యాచ్‌ ల్లో సబలెంకా 6–2, 6–3తో ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై, గార్సియా 1–6, 6–3, 6–3తో లౌరా సీగెముండ్‌ (జర్మనీ)పై, బెన్‌చిచ్‌ 6–2, 7–5తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top