టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్న ఆసీస్‌ కోచ్‌

Aussies Coach McDonald's Hoping Team India To Lose Final Test Match Against England In Ahmedabad - Sakshi

వెల్లింగ్టన్‌: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వాలని ఆసీస్‌ తాత్కాలిక హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ కోరుకుంటున్నాడు. ఆసీస్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ బెర్తు దక్కాలంటే మొటేరా మైదానంలో జరిగే ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను ఇంగ్లీష్‌ జట్టు ఓడించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే న్యూజిలాండ్‌ ఫైనల్‌ ఆశలు గల్లంతై ఆసీస్‌ ఫైనల్‌ చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు జూన్‌లో లార్డ్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడే అవకాశం ఆసీస్‌కు లభిస్తుంది. ఇందుకే ఆసీస్‌ తాత్కాలిక కోచ్‌ టీమిండియా ఓటమిని కోరుకుంటున్నాడు. 

ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న ఆసీస్‌ జట్టుతో పాటు ఉన్న మెక్‌డొనాల్డ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్‌ ఫైనల్‌ బెర్తు అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఓడించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ జట్టుకు కష్టమే అయినప్పటికీ.. తాము మాత్రం రూట్‌ సేన అద్భుతాలు చేసైనా మ్యాచ్‌ను గెలవాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, ఆసీస్‌ రెగ్యులర్‌ హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ విశ్రాంతి తీసుకోవడంతో మెక్‌డొనాల్డ్‌ ఆసీస్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆతిధ్య జట్టును మట్టికరిపించిన పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు, వరుసగా రెండు, మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు మార్చి 4న ఉదయం 9:30కు ప్రారంభంకానుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top