
నాలుగో స్థానంలో నిలిచిన కార్తికేయన్, పద్మిని
ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా వ్యక్తిగత చెస్ చాంపియన్‌షిప్ బ్లిట్జ్ విభాగంలో భారత్‌కు త్రుటిలో రెండు కాంస్య పతకాలు చేజారాయి. పురుషుల విభాగంలో తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ మురళీ కార్తికేయన్... మహిళల విభాగంలో ఒడిశా అమ్మాయి పద్మిని రౌత్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను కోల్పోయారు. నిరీ్ణత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్తికేయన్ ఏడు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు.
రుడిక్ మకారియన్ (రష్యా)కు మూడో స్థానంతోపాటు కాంస్య పతకం ఖరారైంది. కార్తికేయన్‌కు నాలుగో స్థానం, నీలాశ్ సాహా (భారత్)కు ఐదో స్థానం, జియాంగ్ హావోచెన్ (చైనా)కు ఆరో స్థానం లభించాయి. పురుషుల విభాగంలో మొత్తం 111 మంది ప్లేయర్లు పోటీపడగా... 8 పాయింట్లతో 15 ఏళ్ల ఇవాన్ జెమ్లియాన్‌స్కి (రష్యా) విజేతగా అవతరించాడు. ఇరాన్‌కు చెందిన 15 ఏళ్ల సినా మొవాహెద్ 7.5 పాయింట్లతో రజతాన్ని దక్కించుకున్నాడు.
మహిళల విభాగంలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత పద్మిని రౌత్, యుజిన్ సాంగ్ (చైనా), ఎల్నాజ్ కలియాక్‌మెత్ (కజకిస్తాన్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. దాంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కాంస్య పతకాన్ని ఖరారు చేయగా... యుజిన్ సాంగ్‌కు కాంస్యం లభించింది. పద్మిని నాలుగో స్థానంలో, ఎల్నాజ్ ఐదో స్థానంలో నిలిచారు. 7.5 పాయింట్లతో అలువా నుర్మాన్ (కజకిస్తాన్), వాలెంటీనా గునీనా (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా... నుర్మాన్‌కు స్వర్ణం, గునీనాకు రజతం లభించాయి.
ఆసియా టోర్నిలో రష్యా ప్రాతినిధ్యం ఎందుకంటే...
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో రష్యా తరఫున పాల్గొనడంపై నిషేధం విధించాయి. అయితే రష్యా క్రీడాకారులు దేశం తరఫున కాకుండా తటస్థ క్రీడాకారులుగా పాల్గొనవచ్చని ఐఓసీ వెసులుబాటు కల్పించింది. దాంతో పలువురు రష్యా క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నిలలో ఆయా క్రీడా సమాఖ్య పతాకాలపై బరిలోకి దిగుతున్నారు. ఇక రష్యా చెస్ క్రీడాకారుల విషయానికొస్తే 2023లో రష్యా యూరోపియన్ చెస్ యూనియన్ నుంచి బయటకు వచ్చి ఆసియా సమాఖ్యలో చేరింది. పలు టోర్నీలలో రష్యా ప్లేయర్లు ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) తరఫున పాల్గొంటున్నారు. తాజాగా ఆసియా చాంపియన్‌షిప్‌లో రష్యా క్రీడాకారులు ‘ఫిడే’ పతాకంపై పోటీపడుతున్నారు.