
దోహాలో సరికొత్తగా ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్
డిసెంబర్ 26 నుంచి మెగా టోర్నీ
ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు మారబోతున్నాయి. దీంతో గడుల్లో వేసే ఎత్తులు, పైఎత్తులు కొత్త ఫార్మాట్‌లో జరగనున్నాయి. అయితే ఈ తరహా ఫార్మాట్ ఇప్పుడైతే ఖతర్‌లో జరిగే టోర్నీలో నిర్వహిస్తారు. ఆ తర్వాత కొనసాగుతుందో లేదో టోర్నీ జరిగిన విధానం, ఆసక్తిగొలిపిన వైనాన్ని బట్టి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తుది నిర్ణయం తీసుకుంటుంది.
మొత్తానికి ఇన్నాళ్లు జరిగిన ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలది ఒక లెక్కయితే... దోహాలో జరగబోయేది మాత్రం కొత్త లెక్క! ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్ మాత్రం మారలేదు. తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది.
టూకీగా... ఇదీ టోర్నీ కహానీ!
‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్–బ్లిట్జ్ టోర్నీకి దోహా (ఖతర్) ఆతిథ్య వేదిక కాగా... డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆరు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 10 లక్షల యూరోలు (భారత కరెన్సీలో రూ. 9.58 కోట్లు). ఓపెన్ కేటగిరీ విజేతలకు ర్యాపిడ్, బ్లిట్జ్ (3.5 లక్షల యూరోల చొప్పున) 7 లక్షల యూరోలు (రూ. 6.7 కోట్లు), మహిళల విభాగం విజేతలకు 3 లక్షల యూరోలు (రూ.2.87 కోట్లు). ర్యాపిడ్, బ్లిట్జ్‌లకు లక్షన్నర యూరోల చొప్పున కేటాయించారు.
బ్లిట్జ్ ఫార్మాట్ మార్పులివి...
ఈ ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో నాకౌట్ దశను మరింత క్రమబద్దీకరించారు. అంటే గతంలో ఎనిమిది మందితో మొదలయ్యే క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశ స్థానంలో ఇప్పుడు నలుగురు మాత్రమే పాల్గొనే సెమీఫైనల్‌ను తీసుకొచ్చారు. ఈ టోర్నీల తొలిదశ స్విస్ లీగ్ పద్ధతి నుంచి నేరుగా సెమీఫైనల్స్ పోటీలే జరుగుతాయి. మధ్య ఎనిమిది మంది బరిలో ఉండే క్వార్టర్ ఫైనల్స్ ఉండవిక!
ఈ మార్పుతో ఒరిగేదేంటి?
‘ఫిడే’ అధికారుల వివరణ ప్రకారం కొత్త బ్లిట్జ్ ఫార్మాట్‌లో స్విస్ లీగ్ పద్ధతి నుంచి నాకౌట్ చేరే వరకు ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా, పోటాపోటీగా జరిగే అవకాశముంటుంది. స్విస్ లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల ఇందులో నిలకడైన ప్రదర్శన కనబరిచిన వారే చివరకు నాకౌట్ దశ (సెమీస్)కు అర్హత సాధిస్తారు. అంటే ఒకరితో ఒక ఎత్తు పొరపాటుతో ఓడిన మ్యాచ్, మరొకరు ఒక పైఎత్తుతో గెలిచిన మ్యాచ్‌ల వల్ల నాకౌట్ అవకాశాలు కోల్పోరు. ఎందుకంటే విరివిగా ఉండే లీగ్ మ్యాచ్‌ల వల్ల ఒక పొరపాటును అధిగమించి మరో మ్యాచ్‌లో గెలిచే అవకాశాలుంటాయి.
బ్లిట్జ్‌లో 19 రౌండ్లు
ఓపెన్ కేటగిరీలో బ్లిట్జ్ చాంపియన్‌షిప్ 19 రౌండ్ల పాటు జరుగుతుంది. మహిళల విభాగంలో 15 రౌండ్ల పాటు నిర్వహిస్తారు. అనంతరం నలుగురు చొప్పున సెమీఫైనల్‌కు చేరతారు. ఇక్కడి నుంచి గెలిచిన ఇద్దరి మధ్య ఫైనల్ పోరు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని, నియమనిబంధనల్ని ఫిడే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
యథాతథంగానే ర్యాపిడ్ ఈవెంట్
బ్లిట్జ్ పోరు మారింది. కానీ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌ను ఫిడే మార్చలేదు. ఓపెన్ కేటగిరీలో 13 రౌండ్లు, మహిళల విభాగంలో 11 రౌండ్ల మ్యాచ్‌లు జరుగుతాయి. అగ్రస్థానంలో నిలిచిన వారే విజేతగా ఆవిర్భవిస్తారు. ఒకవేళ టాప్‌లో పాయింట్లు సమంగా ఉంటే మాత్రం విజేతను తేల్చడానికి ప్లేఆఫ్ పోటీని నిర్వహిస్తారు.
గత ఏడాది న్యూయార్క్ వేదికగా ప్రపంచ ర్యాపిడ్, చెస్ చాంపియన్‌షిప్ జరిగింది. ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్‌లో విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల ముర్జిన్... మహిళల విభాగంలో భారత స్టార్ కోనేరు హంపి విజేతలుగా నిలిచారు. బ్లిట్జ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో ఇయాన్ నిపోమ్‌నిషి (రష్యా), కార్ల్‌సన్ (నార్వే) సంయుక్త విజేతలుగా నిలువగా... మహిళల విభాగంలో చైనాకు చెందిన జు వెన్‌జున్ టైటిల్ సాధించింది.