
దోహాలో ఇరుపక్షాల మధ్య చర్చలు సఫలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి దిశగా ముందడుగు పడింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు ఆదివారం అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం శాంతియుత పరిస్థితులు, స్థిరత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా దాడులు, కాల్పులు, ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల్లో పలువురు సైనికులు, సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు మరణించారు.
కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, అఫ్గాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ మధ్య ఖతార్ రాజధాని దోహాలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల కోసం ఖతార్, తుర్కియే దేశాలు చొరవ తీసుకున్నాయి. కాల్పులు వెంటనే ఆపేయాలని పాక్, అఫ్గాన్ అంగీకారానికి వచి్చనట్లు ఖతార్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే రాబోయే రోజుల్లో తరచుగా సమావేశం కావాలని, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, భద్రత, స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది.