‘ఆసియా’ అంతంతే! | Asian countries fair poorly at football at the international stage | Sakshi
Sakshi News home page

‘ఆసియా’ అంతంతే!

Jun 9 2026 5:50 AM | Updated on Jun 9 2026 5:50 AM

Asian countries fair poorly at football at the international stage

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఫేవరెట్స్‌ ముద్రలేని ఆసియా దేశాలు

ఈసారి దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా జట్లపైనే ఆశలు  

టేబుల్‌ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, బ్యాడ్మింటన్‌... తదితర వ్యక్తిగత క్రీడాంశాల్లో విశ్వవేదికపై ఆసియా దేశాల క్రీడాకారులు సంపూర్ణ ఆధిపత్యం చలాయిస్తుంటారు. కానీ జట్టు క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో మాత్రం ఆసియా దేశాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. కోట్లాది మంది క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లోనైతే ఆసియా దేశాలు చిరస్మరణీయ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. 2002లో దక్షిణ కొరియా–జపాన్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా జట్టు సెమీఫైనల్‌ చేరడమే ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో ఆసియా దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన.  

పెరిగిన ఆసియా బెర్త్‌లు... 
32 జట్లతో ప్రపంచకప్‌ నిర్వహించినపుడు ఆసియాకు నేరుగా 4 బెర్త్‌లు దక్కేవి. ఇంటర్‌ కాన్ఫడరేషన్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ద్వారా ఐదో బెర్త్‌కు కూడా అవకాశం ఉండేది. ఈసారి జట్ల సంఖ్య 48కి పెరగడంతో ఆసియా దేశాలు బెర్త్‌లు రెట్టింపై 8కి చేరుకున్నాయి. ఇంటర్‌ కాన్ఫడరేషన్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ద్వారా తొమ్మిదో బెర్త్‌ కూడా అవకాశం లభించింది. 47 దేశాలు పోటీపడ్డ ఆసియా క్వాలిఫయింగ్‌ ద్వారా ఈసారి దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, ఇరాన్‌ జట్లు ఎనిమిది బెర్త్‌లు దక్కించుకోగా... ఇంటర్‌ కాన్ఫడరేషన్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ఇరాక్‌ జట్టు 2–1 గోల్స్‌తో బొలీవియా జట్టును ఓడించి తొమ్మిదో బెర్త్‌ను సంపాదించింది. జోర్డాన్, ఉజ్బెకిస్తాన్‌ జట్లు తొలిసారి ప్రపంచకప్‌ టోరీ్నకి అర్హత సాధించాయి.  

ఆ మూడు జట్లపైనే... 
దక్షిణ కొరియా జట్టు 12వసారి, జపాన్‌ జట్టు 8వసారి బరిలోకి దిగుతున్నాయి. ఇరాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్లకు ఇది ఏడో ప్రపంచకప్‌ కానుంది. ఖతార్, ఇరాక్‌ జట్లు రెండోసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్నాయి. జపాన్‌ జట్టు నాలుగుసార్లు, ఆస్ట్రేలియా రెండుసార్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ వరకు వచ్చాయి. ఈసారి కూడా దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా జట్లపైనే ఆసియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మిగతా ఆరు జట్లు గ్రూప్‌ దశను దాటి ముందుకు వెళితే బోనస్‌ అనుకోవాలి.              
 – సాక్షి క్రీడా విభాగం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement